కర్ణుని గొప్పతనాన్ని లోకానికి తెలియజేయడమే శ్రీకృష్ణుడు ప్రణాళిక


రాయబార వేళ శ్రీకృష్ణుడు, కర్ణునితో ఏకాంతంగా మాట్లాడుతూ... ‘నువు పాండవులలో పెద్దవాడివి కనుక, వారి పక్షాన చేరితే హస్తినాపుర పట్టాభిషేకం నీకే చేస్తారు. అంతేకాదు, ఆరవ జామున నీకు ద్రౌపది సేవ చేస్తుంది’ అని ఆశ చూపాడు. ఇది తిక్కన అనువాదంలోనూ ఉన్నది.

‘ఆరవ జాము’ అంటే ‘చీకటి పడ్డాక’ అని. భగవంతుడే ఇలా అనడం ధర్మమా? అసలు, ఇందులోని పరమార్థం ఏమిటి? శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ. సర్వజ్ఞుడు. భూభారాన్ని తగ్గించే నిమిత్తం ధర్మస్థాపనకై అవతరించినవాడు. అవును, తానే కర్ణుడిని అలా ప్రలోభ పెట్టాడు. అలా కర్ణుని స్నేహధర్మం, కృతజ్ఞతాభావం, ఋజుప్రవర్తన నిరూపితమయ్యాయి.

కర్ణుని గొప్పతనాన్ని లోకానికి తెలియజేయడమే ప్రణాళిక. కృష్ణుని రాయబారం లౌకికమే తప్ప, యుద్ధ నివారణమూ కాదు. ‘యుద్ధం అనివార్యమని, కర్ణుడు ప్రలోభాలకు లొంగడని’ కృష్ణునికీ తెలుసు.

తల్లి కుంతీదేవి ఆజ్ఞ మేరకు తన పుత్రులందరికీ ద్రౌపది భార్య కావలసి ఉన్నది. కర్ణుడు సూర్యుని వరంతో పుట్టినవాడు. కుంతికి జ్యేష్ఠ పుత్రుడు. అందువల్ల ఒక అవకాశం కనబడుతున్నది. కర్ణుడు ప్రలోభాలకు లొంగలేదు కనుక, కర్ణునికి భార్య కాలేదు.

శత్రుసైన్యం బలాన్ని తగ్గించడమూ ఒక యుద్ధనీతి. దుర్యోధనునికి కుడిభుజం కర్ణుడే. అతను పాండవపక్షంలో చేరితే దుర్యోధనుడు శక్తిహీనుడు అవుతాడు. కర్ణుడు దుష్టచతుష్టయంలోని వాడే అయినా అతను దుష్టుడు కాడు. ఇది నిరూపించబడిన నిజం.