Advertisement

మైసూర్ లో ప్రసిద్ధి చెందిన లలితా మహల్ ప్యాలెస్

By: chandrasekar Tue, 04 Aug 2020 8:33 PM

మైసూర్ లో ప్రసిద్ధి చెందిన  లలితా మహల్ ప్యాలెస్


తెల్లని రంగు మరియు వాస్తు శిల్పానికి ప్రసిద్ధి చెందింది లలితా మహల్ ప్యాలెస్. అందమైన ప్రవేశ ద్వారం, గోపురం గల ఈ ప్యాలెస్ గురించి మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. కేవలం పర్యాటకులకు మాత్రమే కాకుండా సినిమాలకు కూడా ప్రసిద్ధ గమ్యస్థానమైన ఈ ప్యాలెస్ విశేషాలు తెలుసుకుందాం. ప్యాలెస్ ల నగరమైన మైసూర్ లో అంబ విలాస్ ప్యాలెస్ తరువాత లలితా మహల్ రెండవ అతిపెద్ద ప్యాలెస్. ఇది మైసూర్ రైల్వే స్టేషన్ నుండి 7 కిలోమీటర్లు మరియు కే‌ఎస్‌ఆర్‌టి‌సి బస్ స్టేషన్ నుండి 6.5 కిలోమీటర్ల దూరంలో చాముండి హిల్స్ పర్వత ప్రాంతంలో ఉంది. నల్వాడి కృష్ణరాజ వడయార్ 1921 లో నిర్మించిన ఈ ప్యాలెస్ భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మైసూరును యూనియన్ ఆఫ్ ఇండియాలో చేర్చడం వలన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్తిగా మారింది.

అప్పట్లో ఈ ప్యాలెస్ అతిధి గృహం

లలితా మహల్ ప్యాలెస్ తెలుపు రంగుకు ప్రసిద్ధి చెందింది. దూరం నుండి ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాజ భవనాన్ని మైసూర్ కు చెందిన మహారాజా నల్వాడి కృష్ణ రాజ వడయార్ తన రాజ అతిధుల కోసం నిర్మించారు. ఇప్పుడు ఇండియా టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చేత ఇది ఒక హెరిటేజ్ హోటల్ గా నిర్వహించబడుతుంది. ఇప్పటికి ఈ ప్యాలెస్ దాని వాస్తు శిల్పం మరియు అందంతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేసింది. దీనిని మొదట మహారాజా అతిధిగా ఉన్న అప్పటి వైస్ రాయ్ గెస్ట్ హౌస్ గా నిర్మించారు. ఆ తరువాత ఇతర రాజ అతిధులు మరియు రాజ సందర్శకులకు ఆతిధ్యం ఇవ్వడానికి ఉపయోగించబడింది.

రూ.13 లక్షల వ్యయంతో నిర్మించిన ప్యాలెస్

లండన్ లోని సెయింట్ ఫాల్స్ కేథడ్రాల్ నిర్మాణంతో ప్రేరణ పొందిన లలితా మహల్ ప్యాలెస్ ను రూ.13 లక్షల వ్యయంతో రెండు అంతస్తుల్లో నిర్మించారు. ఈ ప్యాలెస్ చుట్టుపక్కల అద్భుతమైన కొండల దృశ్యాలను కూడా అందిస్తుంది. 1974 లో ఇది లగ్జరీ హెరిటేజ్ హోటల్ గా మార్చబడింది. భారత ప్రభుత్వం యొక్క ఇండియన్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఐ‌టి‌డి‌సి) లోని అశోక్ గ్రూప్ చేత ఇది నిర్వహించబడుతుంది. ఇప్పటికీ ఈ ప్యాలెస్ రాజ శైలిని కలిగి ఉండడం విశేషం.

famous,lalita mahal,palace,located,mysore ,మైసూర్ లో,  ప్రసిద్ధి , చెందిన ,  లలితా,  మహల్ ప్యాలెస్


నిర్మాణ సౌందర్యానికి ఎంతో ప్రసిద్ధి చెందింది

లలితా మహల్ ప్యాలెస్ నిర్మాణ సౌందర్యానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. నిస్సందేహంగా మైసూర్ లోని అత్యంత అందమైన భవనాలలో ఇది ఒకటి. ఈడబ్ల్యూ ఫ్రీట్చ్లీ గోళాకార గోపురాలతో లలితా మహల్ ను రూపొందించారు. ప్రవేశ ద్వారం పైన ఉన్న కేంద్ర గోపురం ప్రధానంగా పెద్దది. ప్యాలెస్ యొక్క ప్రవేశ ద్వారం ప్రశంసించే విధంగా ఎంతో అందంగా అలంకరించబడింది. దీనిని గార్డ్ హౌస్ అని కూడా పిలుస్తారు. ప్యాలెస్ లోపలి భాగంలో బెల్జియన్ క్రిస్టల్ శాండిలియర్స్, పెర్షియన్ తివాచీలు, పాల రాతి గచ్చులు, శిల్పాలు మరింత అందాన్ని జోడిస్తాయి.

లలితా మహల్ ప్యాలెస్ 1974 లో హెరిటేజ్ హోటల్ గా మార్చబడింది. ఇప్పుడు దేశంలోని ఉత్తమ లగ్జరీ హోటళ్లలో ఇది ఒకటి. అతిధులకు చారిత్రక కీర్తి మరియు గొప్పదనాన్ని ఆస్వాదించే అవకాశం ఇక్కడ లభిస్తుంది. సాంప్రదాయ సౌకర్యాలకు వివిధ ఆధునిక సౌకర్యాలు కూడా జోడించబడ్డాయి. అంటే రాజ వైభవానికి ఎక్కడా రాజీ పడకుండా, పాత వైభవం కోల్పోకుండా లగ్జరీ హోటల్ గా మార్చేందుకు కొన్ని మార్పులు ఇందులో అమలు చేయబడ్డాయి.

ప్యాలెస్ లో మరెన్నో ఆకర్షణలు

ఈ ప్యాలెస్ లో డ్యాన్స్ హాల్, బాంకెట్ హాల్, మైసూర్ రాజుల చిత్రాలతో సెంట్రల్ హాల్, వైస్రాయ్ రూమ్ మరియు అద్భుతమైన డిజైన్ కలిగిన ఇటాలియన్ పాలరాయి మెట్లు ఉంటాయి. అంతేకాదు ప్యాలెస్ మధ్యలో నిర్మించిన పచ్చని తోటలు చూసేందుకు ఎంతో సుందరంగా అనిపిస్తాయి. ఈ ప్యాలెస్ లో ప్రస్తుతం 54 సూట్ లు మరియు అతిధులు నివసించడానికి గదులు ఉన్నాయి. వినోద ప్రయోజనాల కోసం హెల్త్ క్లబ్, స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్, బిలియర్డ్ రూమ్, టెన్నిస్ కోర్ట్ మరియు చెస్ రూమ్ కూడా ఉన్నాయి. ఏప్రిల్ నుండి జూన్ మధ్య వేసవి కాలం మైసూర్ సందర్శనకు మంచిది కాదు. మైసూర్ లో వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతుంటాయి. జూలై నుండి సెప్టెంబర్ మధ్య మైసూర్ లో వర్షాకాలం ఉంటుంది. వీటితో పోల్చుకుంటే అక్టోబర్ నుండి మార్చి మధ్య శీతాకాలం మైసూర్, లలితా మహల్ సందర్శనకు అనువైనది.

Tags :
|
|

Advertisement