Advertisement

తలకోన ప్రకృతి అందాలు

By: chandrasekar Tue, 30 June 2020 8:25 PM

తలకోన  ప్రకృతి అందాలు


తెలుగు రాష్ట్రాల్లోనే ఎత్తైన జలపాతం. చిత్తూరు జిల్లాలోని శేషాచలం కొండల్లో ఉన్న తలకోన ప్రకృతి అందాలతో కట్టిపడేస్తుంది. 60 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే ఈ జలపాతంలో నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే అందులో ఉండే చేపలు, భక్తులు వేసే నాణేలు సైతం స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడికి మెట్ల దారిలో చేరుకోవాలి. ఎత్తైన పర్వాతల్లోని పలు ఔషద మొక్కలు మీదుగా ఈ నీరు ప్రవహిస్తుండటం వల్ల అందులో ఔషద గుణాలు ఉంటాయని అంటారు.

ఈ జలపాతంలో స్నానం చేయడానికి వీలుగా మెట్లు కూడా ఉన్నాయి. తలకోన జలపాతాన్ని ‘శిరోధ్రోణం’ అని, తలకోన కొలనును ‘శిరోద్రోణ తీర్థం’ అని కూడా పిలుస్తారు. ఈ నీటిలో స్నానం చేస్తే రోగాలు నయమవుతాయని స్థానికుల విశ్వాసం.

వేంకటేశ్వరుడు పవళించిన చోటు కావడం వల్ల ఈ ప్రదేశానికి తలకోన అని పేరు వచ్చింది. కుబేరుడి అప్పు తీర్చడం కోసం ధనాన్ని కొలిచీ కొలిచీ అలసిపోయిన వేంకటేశ్వరస్వామి ఇక్కడకు వచ్చి తలవాల్చాడని, అందుకే ఈ ప్రాంతానికి తలకోన అని పేరు వచ్చిందని చెబుతుంటారు. ఆదిశేషుడు ఇక్కడ పర్వత రూపం దాల్చాడనే పురాణ గాథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ ప్రాంతాల్లో తలకోనతో పాటు నేలకోన అనే చిన్న జలపాతం కూడా ఉంది. వీటిని జంట జలపాతాలని కూడా పిలుస్తారు. ఇక్కడి చెట్లు ఎంతో ఎత్తుగా ఉంటాయి.

దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో వెలుతురు చాలా తక్కువగా ఉంటుంది. వేంకటేశ్వర నేషనల్‌ పార్కులో ఎర్రచందనం, జలాది, మద్ది చెట్లతో పాటు, ఏనుగులు, ఎలుగుబంట్లు, నెమళ్లు, అడవి కొళ్లు, దేవాంగ పిల్లలు, ముచ్చుకోతులు తదితర జంతు జాతులు ఉన్నాయి. చెట్లపై నడిచేందుకు వీలుగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన మార్గం (కెనఫీ వాక్) ఏర్పాటు చేసింది. దాదాపు 30 నుంచి 40 అడుగుల ఎత్తులో చెట్ల మధ్య నడస్తూ అటవీ ప్రాంతాన్ని చూడటం సరికొత్త అనుభూతిగా నిలిచిపోతుంది. తలకోనలో ట్రెక్కింగ్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

beauty,thalakona,water,falls,travel ,తలకోన,  ప్రకృతి, అందాలు, తెలుగు రాష్ట్రాల్లో, చిత్తూరు జిల్లా


తలకోన అడవి మొత్తం 87,000 ఎకరాలు విస్తరించి ఉంది. ఇక్కడ 3వ శతాబ్దం నాటి తీగజాతి వృక్షం ఉంది. దీన్ని స్థానికులు గిల్లి తీగ అని కూడా అంటారు. దీని చుట్టుకొలత సుమారు 260 సెంటీ మీటర్లు. అనేక శాఖలుగా విస్తరించే ఈ తీగ చెట్టు పొడవును లెక్కిస్తే దాదాపు 5 కిమీలు ఉంటుంది. దీనికి 100 సెం.మీ. పొడవైన కాయలు కాస్తాయి. కొండజాతి మనషులు ఈ కాయలను డబ్బాలుగా తయారు చేసుకుని వాడతారు.

తలకోన జలపాతానికి సమీపంలో సిద్దేశ్వర ఆలయం ఉంది. దీన్ని 1811లో అప్పస్వామి అనే భక్తుడు నిర్మించాడు. ఈ ఆలయ సమీపంలో ఉన్న నేలకోనలో స్నానం చేసి సంతానం కోసం ప్రార్థిస్తే కోరిక తీరుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో గణపతి, సిద్ధేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, నవగ్రహాలు కొలువుదీరాయి.

తలకోన జలపాతాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకుల కోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అతి గృహం, అటవీ శాఖగెస్ట్ హౌస్ కూడా అందుబాటులో ఉంది. తలకోన వెళ్లేప్పుడు ఆహారాన్ని వెంట తీసుకెళ్లండి. లేదా, సిద్దేశ్వర ఆలయం వద్ద ఉన్న హోటల్‌లో మాత్రమే ఆహారం లభిస్తుంది.

తలకోన తిరుపతికి 48 కిమీల దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకునేందుకు తిరుపతి బస్ కాంప్లెక్స్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. తిరుపతి నుంచి యెర్రావారిపాళెం చేరుకుని అక్కడి నుంచి ఆటో లేదా వ్యానుల్లో తలకోనకు చేరుకోవచ్చు.

Tags :
|
|
|

Advertisement