Advertisement

'తెలంగాణ ఊటీ' అనంతగిరి కొండల విశేషాలు

By: Sankar Sun, 12 July 2020 5:33 PM

'తెలంగాణ ఊటీ' అనంతగిరి కొండల విశేషాలు



రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న 'అనంతగిరి కొండలు' ప్రకృతి అందాలకు నెలవు. దాదాపు 3,763 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అడవి అందాలతో అబ్బుర పరుస్తోంది. ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ఉన్న ఈ ప్రాంతంలోని కొండలు, అడవి అందాల మధ్య 1300 సంవత్సరాల చరిత్ర గల 'అనంత పద్మ నాభస్వామి ఆలయం' అందరినీ ఆకర్షిస్తోంది. అనంతగిరిని 'తెలంగాణ ఊటీ'గా చెప్పవచ్చు. ఈ కొండల పైనుండి నీరు ఒస్మానాసాగర్ మరియు అనంత సాగర్‌కు ప్రవహిస్తాయి. ఇక్కడి అడవులు తెలంగాణ రాష్ట్రంలోనే దట్టమైనవి. హైదరాబాదు నుండి ప్రవహిస్తున్న మూసీ నదికి అనంతగిరి కొండలే జన్మస్థానం.

వికారాబాద్‌ నుంచి అనంతగిరికి వెళ్తుంటే రోడ్డు పొడవునా ఇరువైపులా పచ్చని చెట్లతో అలరారుతుంది. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునేవాళ్లు ఇక్కడికి వస్తే శరీరం ఉత్తేజ కరంగా మారుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎత్తయిన కొండలు, పచ్చటి హరిత వనాలు, ఇరుకైన లోయలు, అలరించే మయూరాలు, స్వచ్ఛమైన గాలి, సహజ సిద్ధంగా ఏర్పడిన మంచినీటి బుగ్గలు ఇలా ఎన్నో ప్రకృతి అందాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి.

అనంత పద్మ నాభస్వామి ఆలయానికి దిగువన ఉన్న లోతైన లోయలో భవనాశి అనే పుష్కరిణి ఉంది. అక్కడికి వెళ్లడానికి సుమారు వందమెట్లు దిగి వెళ్లాలి. ఈ పుష్కరిణినే మూసీనది జన్మస్థానంగా చెబుతారు. ఈ నది ఓ చిన్నపాయగా ప్రారంభమై హైదరాబాద్‌ నగరంలో ప్రవహించి అనంతరం నల్గొండ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తోంది.


ananthagiri,hills,vikarabad,telanagana,special,story ,తెలంగాణ,  ఊటీ, అనంతగిరి , కొండల,  విశేషాలు ,  వికారాబాద్



టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ నిర్మాతలు సైతం వికారాబాద్, అనంతగిరి కొండలను షూటింగ్‌లకు ఎంచుకుంటున్నారు. అనంతగిరి కొండలను, అక్కడే కొలువుదీరిన అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని చూసేందుకు పర్యాటకులే రావడం లేదు. టాలీవుడ్ టూ బాలీవుడ్ సినిమా షూటింగ్‌లకు ఇక్కడి ప్రాంతాలు అనువైనవని సినీ నిర్మాతలు, దర్శకులూ ఈ ప్రాంతం పట్ల ఆసక్తి చూపుతున్నారు..

హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో సినీ ప్రముఖులు ఇక్కడి అందమైన లొకేషన్స్‌పై మక్కువ చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో పాటు సహజత్వానికి వీలుండటమే ఇందుకు కారణం. దశాబ్దకాలంగా నిర్మితమైన సినిమాల్లో దాదాపు 60 శాతానికి పైగా ఇక్కడ షూటింగ్ చేసినవే కావడం విశేషం. మొదట్లో చిన్న సినిమాలకే పరిమితమైనా.. నేడు అగ్ర హీరోల షూటింగ్‌లు అనంతగిరి కొండల్లో జరుగుతున్నాయి.

పక్షుల కిలకిల రావాలు... కుందేళ్ల పరుగులు... నెమళ్ల సోయగాలు.. పచ్చని పంటపొలాలతో కోట్‌పల్లి ప్రాజెక్టు కళకళలాడుతుంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. నీటి అలలను ముద్దాడుతూ వచ్చే చల్లని గాలలు బరువెక్కిన శరీరాన్ని తేలికపరుస్తాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ప్రాజెక్టులో జలకాలడుతూ ఆనందంగా గడుపుతారు. వికారాబాద్‌కు 30 కిలోమీటర్ల పరిధిలో, పెద్దేముల్‌కు సమీపంలో ఉన్న కోట్‌పల్లి ప్రాజెక్టు హాలీడే స్పాట్‌గా మారుతోంది.

ఇన్ని అందాలు ఉన్న ఈ అనంతగిరి కొండలు హైదరాబాద్ కు పక్కనే ఉన్నాయి..హైద్రాబాద్లోని బస్సు స్టేషన్ నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుంది ..అంతే కాకుండా ముంబై వెళ్లే ప్రతి రైలు వికారాబాద్లో ఆగుతుంది ..కానీ సొంత వాహనాల్లో వెళ్తే బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది ..


Tags :
|

Advertisement