Advertisement

పల్లికొండేశ్వరుని దర్శనం జన్మజన్మల పుణ్యఫలం

By: Dimple Sat, 08 Aug 2020 02:36 AM

పల్లికొండేశ్వరుని దర్శనం జన్మజన్మల పుణ్యఫలం

లయకారకుడైన పరమేశ్వరుడు యావత్భారతదేశంలో లింగరూపంలోనే దర్శనమిస్తుంటాడు. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా చిత్తూరుజిల్లా సత్యవేడు నియోజవర్గం నాగలాపురం మండం - తమిళనాడులోని ఊత్తుకోటకు సమీపంలో సురుటుపల్లిలో పల్లికొండేశ్వరుడు అమ్మవారి ఒడిలో పవళించినట్లుగా భక్తులకు దర్శనమిస్తారు. సర్వమంగళాదేవి ఒడిలో తలపెట్టుకుని శయనించే శివుని అరుదైన దేవాలయం ఇది.

పురాణ ఇతిహాసాల్లో క్షీరసాగరం మధించినపుడు ఉద్భవించే హలాహలం తొలిసారిగా తన ప్రాణాలనే పణంగాపెట్టి శివుడు సేవిస్తాడని ప్రతీతి. అయితే.. కాలకూట విషాన్నితనగొంతులోనే ఉండగానే పార్వతీదేవితన అమృతహస్తంతో గొంతును నిమురుతుందని... ఆ విషం గొంతువద్దే మటుమాయమైపోయిందని... అందుకే శివుడికి గొంతువద్ద ప్రత్యేక మచ్చ ఉంటుంది. దీంతో పరమేశ్వరుని నీలకంఠేశ్వరుడని పేరొచ్చింది. విషప్రభావం వల్ల ఏర్పడిన బడలికను తీర్చుకోవడానికి పార్వతీదేవి ఒడిలో శిరస్సు ఉంచి యోగనిద్రలోకి జారుకున్నాడని స్థలపురాణం.

శయన మూర్తికి ఏర్పడిన స్ధితికి చింతిస్తూ బ్రహ్మ, మహా విష్ణు వు తదితర దేవతలు త్రయోదశి నాడు ఆయన వద్దకు వచ్చారు.మహాదేవుడు యోగ నిద్ర నుంచి మేలుకొని తన కమల నేత్రములను వికసింపజేసి గౌరి సమేతంగా అందరినీ చల్లని దృష్టితో అనుగ్రహించా డు. శివుడు కాలకూట విషాన్ని సేవించి సర్వలోకాలకూ సుఖసంపదలను అనుగ్రహించడం వల్ల ఈ క్షేత్రానికి కాలకూటాచల క్షేత్రమని, దేవతలంతా వచ్చినందున ఈ ఊరికి సురులపల్లిగా పేరొచ్చింది. సురుటుపల్లిగా మారింది. పార్వతీ పరమేశ్వరులు ప్రదోష వేళలో సర్వలోకాలనూ సంపూర్ణ దృష్టితో అనుగ్రహించడం వల్ల మహా ప్రదోష క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది.

సాధారణంగా కొన్ని వైష్ణవ క్షేత్రాల్లో శ్రీమహా విష్ణువు మాత్రమే శయనభంగిమలో దర్శనమిస్తుంటాడు. శివుడు మాత్రం లింగరూపంలో విశేష అభిషేక పూజలు అందుకుంటూ ఉంటాడు.

ఆరణి నదితీరాన వెలసిన దివ్యక్షే్త్రంలోసతీసమేతంగా కొలువు దీరి భక్తాదులను ఆశీర్వదిస్తున్నారు. గర్భగుడి అమ్మవారి ఒడిలో పవళించినట్లు దర్శనమిస్తున్న స్వామి వారిచుట్టూ సర్వదేవతా సపరివారంగా జాగరణ చేస్తున్నట్లు కన్పిస్తారు. పల్లికొండేశ్వరునిగా దర్శనమిస్తున్న పరమేశ్వరుడిని తలచినంతనే కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢవిశ్వాసం. ప్రతి సోమవారం ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో సర్వదేవతా సపరివారంగా కొలువుదీరిన పవిత్రక్షేత్రంగా భాసిల్లుతోంది.

యావద్భారత దేశంలోని శివాలయాల్లో శివుడు లింగాకారంలో దర్శనమిస్తాడు. కొన్నిచోట్ల ధ్యానముద్రలో ప్రశాంతంగా కూర్చున్న భంగిమలో శివయ్యను దర్శించుకుంటాం. కానీ, పార్వతీదేవి ఒడిలో నిద్రిస్తున్న భంగిమలో ఉన్న శివుడి విగ్రహాన్ని భక్తజనం ఎక్కడా చూసి ఉండరు. పద్నాలుగు అడుగుల ఎత్తులో ఈ అరుదైన శయన శివుడి దర్శనం మనకు చిత్తూరు జిల్లాలోని సురుటపల్లి గ్రామంలోని పల్లికొండేశ్వర ఆలయంలో లభిస్తుంది. చుట్టూ బ్రహ్మ విష్ణువులు, సూర్యచంద్రాదులు, నారద తుంబురులు, ఇంద్రుడు, కుబేరుడు, మార్కండేయుడు, అగస్త్య, పులస్త్య, వాల్మీకి, విశ్వామిత్రాది మహర్షులు కొలువు తీరి ఉండగా శివుడు పార్వతీదేవి ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తున్న భంగిమలో భక్తులకు దర్శనమిచ్చే దృశ్యం భక్తుల్ని పరవశింపజేస్తుంది. శివుడు, సురుటుపల్లి దివ్యక్షేత్రంలో శయనరూపంలో భక్తాదులకు దర్శనమిస్తారు.

కోరిన కోర్కెలు తీర్చే మహిమాన్విత క్షేత్రంలో రకరకాల అభిషేకాలతో స్వామివారిని పూజిస్తారు. పంచామృతంతో అభిషేకం.. ఆరోగ్య ప్రాప్తి. పాలతో అభిషేకం.. దీర్ఘాయు ప్రాప్తి. పెరుగుతో అభిషేకం.. సత్సంతాన ప్రాప్తి. గంధంతో అభిషేకం.. లక్ష్మీకటాక్ష ప్రాప్తి. స్వామి దర్శనం చేతనే వివాహయోగం. వివాహమైన వారికి దాంపత్య జీవితం సుఖసంతోషాలమయంగా సాగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Tags :

Advertisement