Advertisement

  • పన్నీర్ మరియు ఆంధ్ర స్పెషల్ గోంగూర తో రుచికరమైన కర్రీ

పన్నీర్ మరియు ఆంధ్ర స్పెషల్ గోంగూర తో రుచికరమైన కర్రీ

By: chandrasekar Mon, 15 June 2020 6:31 PM

పన్నీర్ మరియు ఆంధ్ర స్పెషల్ గోంగూర తో రుచికరమైన కర్రీ


పాలనుంచి తయారయ్యే పనీర్ లో అనేక పోషకాలుండి ఆరోగ్యానికి చాలా మేలుచేస్తుంది. కొంతమందైతే పనీర్ ను పచ్చిగానే ఇష్టపడతారు. పచ్చిగా లేదా వండిన రూపంలో తీసుకున్నా పనీర్ ను ఏరకంగా అయినా తీసుకోకుండా ఉండలేం. దానికి చాలా మంచి కారణాలున్నాయి. ఎన్నో పోషక విలువలున్న పనీర్ భారతీయ వంటకాలలో భాగమైపోయింది. పన్నీర్ కర్రీ అంటేనే నోరూరుతుంది. ప్రాచీనకాలం నుంచి పన్నీర్ వంటకాలు ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ దీనిని రోజులో ఒక భాగం చేసుకుంటారు. మనం వాడే ప్రతీ ఆహార పదార్థానికి రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు అపోహలు కూడా ఉంటాయి. నిజానికి పన్నీర్ తింటే కొవ్వు కరుగుతుందట. రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌ చేస్తుంది. అంతేగాక కండరాలు, నాడుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ పన్నీర్ తో బాటు గోంగూర కలిపి రుచికరమైన కర్రీ ఎలా తాయారు చేయాలో చూస్తాం.

కావలసిన పదార్థాలు:

* పనీర్ -100 గ్రాములు
* గోంగూర - నాలుగు కట్టలు
* నూనె - తగినంత
* లవంగాలు - ఆరు
* కారం - టీ స్పూన్
* జీడిపప్పు - కావల్సినంత
* ఏలకులు - ఆరు
* దాల్చిన చెక్క - చిన్నముక్క
* నెయ్యి - కావల్సినంత
* ఉల్లిపాయలు - రెండు
* పచ్చిమిర్చి - నాలుగు
* అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
* కరివేపాకు - రెండు రెమ్మలు
* జీలకర్ర - స్పూన్
* పసుపు - అర టీ స్పూన్
* ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం:

ఒకే పాత్రా తీసికొని అందులో రెండు గ్లాసుల నీళ్లుపోసి కాస్త వేడెక్కిన తర్వాత పనీర్ వేసి అయిదారు నిముషాల తర్వాత తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పనీర్ ముక్కలు ముక్కలుగా విరిగిపోకుండా ఉంటుంది. తరువాత పాన్‌లో నీళ్లు పోసి గోంగూరను ఉడకపెట్టుకోవాలి. తరువాత గిన్నెలో నెయ్యి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, జీడిపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి చల్లారిన తర్వాత వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోంగూరను కూడా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. బాణలిలో నూనె వేసి వేడెక్కిన తరువాత కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్ , అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి అందులో గోంగూర పేస్ట్, పనీర్ ముక్కలు, కొద్దిగా పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి కలిపి రెండు కప్పుల నీళ్లుపోసి తక్కువ సెగమీద ఉడికించాలి. పనీర్ గోంగూర కర్రీ రెడీ. దీనిని ప్లేటులో అందరికి సెర్వ్ చేయడమే ఆలస్యం.

Tags :
|

Advertisement