Advertisement

  • కరోనా రోగి...మృతి చెందిన 14 రోజుల తర్వాత వెలుగులోకి...!

కరోనా రోగి...మృతి చెందిన 14 రోజుల తర్వాత వెలుగులోకి...!

By: Anji Tue, 27 Oct 2020 06:04 AM

కరోనా రోగి...మృతి చెందిన 14 రోజుల తర్వాత వెలుగులోకి...!

కరోనా బారినపడి హాస్పిటల్‌లో చేరిన ఓ యువకుడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి అక్కడి టాయిలెట్‌లోకి వెళ్లాడు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొని అక్కడే కుప్పకూలి మరణించాడు.

అతడు మృతి చెందిన 14 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. టాయిలెట్ ‌నుంచి దుర్వాసన వస్తుండటంతో తెరిచి చూడగా అతడి మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. బాధితుడు టాయిలెట్ల వైపు వెళ్లిన సమయంలో ఎవరూ గమనించకపోగా.. 14 రోజులుగా ఆ విషయాన్ని గుర్తించకపోవడం గమనార్హం.

పైగా అతడు హాస్పిటల్ నుంచి అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం మరింత షాకింగ్‌కు గురి చేసే అంశం. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని శివాడి ప్రాంతంలో ఉన్న టీబీ హాస్పిటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

అదృశ్యమైన రోగి టాయిలెట్‌లో శవమై కనిపించడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు, బృహత్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) అధికారులు హాస్పిటల్‌కు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

హాస్పిటల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాబన్‌ యాదవ్‌ (27) అనే వ్యక్తి టీబీ వ్యాధితో కొన్ని రోజుల కిందట హాస్పిటల్‌లో చేరాడు. కరోనా పరీక్షల్లో అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతడికి అక్కడే చికిత్స అందిస్తున్నారు.

అయితే.. కొన్ని రోజుల కిందట అతడు హాస్పిటల్ నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంలో హాస్పిటల్ సిబ్బంది అక్టోబర్‌ 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సూర్యాబన్ యాదవ్ అదృశ్యమైన 14 రోజుల తర్వాత హాస్పిటల్ టాయిలెట్లలో శవమై కనిపించాడు. హాస్పిటల్‌లో పనిచేసే ఓ వార్డ్‌ బాయ్‌.. సదరు టాయిలెట్‌ గది నుంచి దుర్వాసన రావడం గమనించి తలుపులు పగలగొట్టి చూడగా సూర్యాబన్‌ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది.

హాస్పిటల్‌లో రోగి మరణిస్తే.. 14 రోజులుగా మృతదేహాన్ని గుర్తించకుండా ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణకు సహకరించాలంటూ హాస్పిటల్ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు.

రాక్‌ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది. సూర్యాబన్‌ మృతికి సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తామని, ఒక మృతదేహాన్ని ఇన్ని రోజులుగా గుర్తించకుండా ఎలా ఉన్నారు అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Tags :
|

Advertisement