Advertisement

  • జనజీవితంలో చెరగని ముద్ర - నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి

జనజీవితంలో చెరగని ముద్ర - నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి

By: Dimple Wed, 02 Sept 2020 00:26 AM

జనజీవితంలో చెరగని ముద్ర - నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి

ప్రజాజీవితంలో ఆయన జీవితం ఓ సందేశం... బడుగుజీవులకు ఆయన ఓ దేవుడు... పేదలపాలిట పెన్నిది.... ఆర్థికంగా వెనుకబడినకుటుంబాలకు ఆయన ఓ అండ.. శత్రువుల్ని సైతం ప్రేమాభిమానాలతో మంచి మనసుతో మన్నించిన మహనీయుడు... కల్మషంలేని చిరునవ్వు ఆయన సొంతం... తలపండిన ఉద్దండులు... రాజకీయాల్లో ఆరితేరిన నాయకుల్లో పరిణితి చెందిన రాజకీయనేతగా రాణించిన ధీశాలి... ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని... ప్రత్యర్థి రాజకీయనాయకులను... కంటిచూపుతో కంట్రోల్‌ చేస్తూ... అశేష ప్రజాభిమానం సొంతంచేసుకున్న ప్రజానాయకుడు... ప్రజాపాలన అంటే ఇలా ఉండాలని తన పాలనా దక్షతతో నిరూపించిన నిరాడంబరుడు... అభివృద్ధి అనేది... దార్శనిక దృష్టికలిగిన ఎడమకన్ను... సంక్షేమం అనేది సమాజంపట్ల ఆయనకున్న బాధ్యతగల కుడికన్ను... అన్నీ వెరసిన రాజకీయాల్లో విలక్షణ పురుషుడు... రాజశేఖరుడు... అయనే వైఎస్‌ రాజశేఖరరెడ్డి. అనుక్షణం ప్రజలకోసం తపించిన రాజశేఖర్‌ రెడ్డి ప్రజాహిత కార్యక్రమంలో పాలుపంచుకోడానికి బయలుదేరినట్లే ఉంది ఇప్పటికీ... భౌతికంగా దూరమైన ఆయన... ప్రజలగుండెల్లో మాత్రం చెరగని ముద్రవేసుకున్నారు. ఆయన మోములోని చిరునవ్వు చెరగకుండా... కళ్లెదుటే మెదలాడుతోంది. సరిగ్గా ఆయన భౌతికంగా దూరమై 11 యేళ్లు కావొస్తున్నాయి. 2009, సెప్టెంబరు రెండో తేదిన ప్రజాహిత కార్యక్రమంలో పాలుపంచుకోవాలని హెలికాప్టర్లో బయలుదేరి... నల్లమల అడవుల్లో జరిగిన ప్రమాదంలో కానరాని దూరాలకు ప్రయాణమయ్యాడు.
తనమీద తనకు అపార నమ్మకం ఉన్నా..ఏ వ్యక్తి అయినా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు. విజేతగా మారిన తరువాత నిలకడైన వ్యక్తిత్వంతో రాణించే వ్యక్తే నిలుస్తాడు. భావి తరాలకు స్ఫూర్తిప్రదాత అవుతాడు. వైయస్‌ రాజశేఖరరెడ్డిలోని విలక్షణ గుణం ప్రత్యర్థుల గురించి అతిగా ఆలోచించకపోవడం. అతిగా పట్టించుకోకపోవడం. తనపై తనకు ఆపార నమ్మకం ఉన్న వ్యక్తి ఆయన. అందులో తాను నమ్మింది మంచి అయినప్పుడు ఇక యూటర్న్‌ల గొడవెందుకు అన్నదే అలోచన. అందుకే వైయస్‌ఆర్‌ రాజకీయ జీవితం...ప్రజా జీవితం రెండూ వేరు వేరు కాదు.ప్రజల కోసం పని చేసేదే రాజకీయం అన్నది వైయస్‌ఆర్‌ సిద్దాంతం. ఆ సిద్దాంతాన్ని ఆయన కడవరకు వీడలేదు. తూచా తప్పకుండా పాటిస్తూనే పోయారు. చంద్రబాబు గారి తొమ్మిదిన్నరేళ్ల పాలనలో అప్పుల కుప్ప అయిన ఆంధ్రప్రదేశ్, నిత్య కరువులతో రైతన్నలు అల్లాడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కష్టకాలంలో నేనున్నానని భరోసా అందని ఆంధ్రప్రదేశ్‌కు అప్పుడు వైయస్‌ఆర్‌ ఒక్కడే తోడయ్యారు. ప్రజల కోసం నేనున్నానని మండుటెండల్లో నడిచిన మనిషి అయ్యాడు. ప్రజలకు ధైర్యం చెప్పాడు. తను ముఖ్యమంత్రి కాగానే ప్రజలకు చెప్పినట్లుగా పాలన సాగించారు. వ్యవసాయ రంగం, చేనేత రంగం, పారిశ్రామిక రంగాలతో పాటు భగీరథుడిని తలపిస్తూ తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు అన్నీ...వైయస్‌ఆర్‌ కేసి కళ్లెత్తి చూడాల్సిన పరిస్థితిని కల్పించాయి. ఆయన సంకల్ప బలానికి జేజేలు కొట్టేలా చేశాయి.

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తొలినుంచీ పోరాటమే ఊపిరిగా సాగుతూ వెళ్లారు వైయ‌స్ఆర్‌. ప్రజల కోసం తాను చేపట్టిన పోరాటాన్ని వైఎస్‌ ఏనాడూ ఆపలేదు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో సొంత పార్టీ ముఖ్యమంత్రులపైనే పోరాటం సాగించిన ధీరత్వం వైఎస్‌ది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా కాంగ్రెస్‌ పార్టీలో హేమాహేమీలనదగ్గ సీనియర్‌ నేతలను ఢీకొట్టి తనను నమ్ముకున్న వారికి న్యాయం చేయించిన పోరాట యోధుడుగా నిలిచారు. సిద్ధాంత పరంగానే తప్ప ఏనాడూ ఆయన పోరాటం వ్యక్తిగత స్థాయిలో ఉండేది కాదు. చివరకు 2004కు ముందు పూర్తిగా కుప్పకూలే దశలోకి చేరిన కాంగ్రెస్‌ పార్టీయే ఆయన బాటలో నడిచే పరిస్థితికి వచ్చింది. సొంత పార్టీలో అలా ఉంటే.. బయట తెలుగుదేశం పార్టీతో, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి ప్రజావ్యతిరేక పాలనపై వైఎస్‌ పోరాటం మరో ఎత్తు. 1995 నుంచి 2004 ఎన్నికల వరకు చంద్రబాబు ప్రజాకంటక పాలనపై వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనేక రూపాల్లో పోరాటం సాగించారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్తు చార్జీల పెంపు ఇలా ఎన్నో అంశాలపై ప్రజల తరఫున ప్రభుత్వంపై ఉద్యమించారు. విద్యుత్తు చార్జీల పెంపుపై చివరకు తన ప్రాణాలు పోయినా ఫర్వాలేదంటూ ఆమరణ నిరశన దీక్షలు, చలో అసెంబ్లీ కార్యక్రమాలతో నాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని గడగడలాడించారు. ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు 2003 ఏప్రిల్‌ 9 నుంచి ప్రజాప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్ర చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచింది. మండు వేసవిలో 1,467 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రకు ప్రజలుబ్రహ్మరథం పట్టారు.

Tags :
|
|

Advertisement