Advertisement

  • తెలుగు ప్రజల అభిమానం చూరగొన్న నేత వైఎస్ రాజశేఖరరెడ్డి

తెలుగు ప్రజల అభిమానం చూరగొన్న నేత వైఎస్ రాజశేఖరరెడ్డి

By: chandrasekar Thu, 09 July 2020 5:24 PM

తెలుగు ప్రజల అభిమానం చూరగొన్న నేత వైఎస్ రాజశేఖరరెడ్డి


వైఎస్సార్ పాలనను తలచుకుంటే మచ్చుకు గుర్తుకొచ్చే కొన్ని అంశాలివి. తనదైన పాలనతో తెలుగు ప్రజల అభిమానం చూరగొన్న నేత వైఎస్ రాజశేఖరరెడ్డి. పేద ప్రజల ఇంటి తలుపు తడితే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన జననేతను గుర్తు చేసుకుంటూ కంటతడి పెడతారు. పింఛనుతో ఆకలి తీర్చుకుంటున్న పండుటాకు ప్రతి అన్నం మెతుకులోనూ రాజన్ననే చూసుకుంటుంది. ఫీజు రాయితీతో ఎదిగిన ప్రతి సరస్వతీ పుత్రుడు నీ రుణం తీర్చుకోలేమంటూ చేతులు జోడిస్తాడు. ఆరోగ్యశ్రీతో పునర్జన్మ పొందిన నిరుపేదలైతే ఆ ఆత్మీయ నేతను నిత్యం దేవుడిలా కొలుస్తారు.

జనం గుండెల్లో వైఎస్సార్‌ది చెరగని స్థానం. రాజన్న అంటే ఒక ఆత్మీయ పలకరింపు. అంతకుమించి ఓ పెద్ద దిక్కు. అలాంటి మహానేత అభిమానులు, పార్టీ కార్యకర్తలను తీరని శోకంలో ముంచేస్తూ 2009 సెప్టెంబర్ 2న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆ మరణం తెలుగు ప్రజలకు ఇప్పటికీ ఓ చేదు జ్ఞాపకం. రాష్ట్రంలో ఆ సమయంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. జలయజ్ఞం ద్వారా నిర్మించిన ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ పైలట్‌ను ప్రాజెక్టులకు దగ్గరగా తీసుకెళ్లమని కోరి వైఎస్సార్ అమితమైన ఆనందం పొందేవారని ఆయనతో సన్నిహితంగా పనిచేసిన అధికారులు చెబుతారు.

అది 2009 సెప్టెంబర్ 2, ఆదివారం. రాష్ట్రంలో దట్టమైన క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకున్నాయి. అలాంటి సమయంలో తన మానసపుత్రిక లాంటి పథకం ‘రచ్చబండ’ ద్వారా ప్రజల బాధలు తెలుసుకోవడానికి బయలుదేరారు వైఎస్సార్. ప్రతిపక్షాలన్నీ కలిసి కూటమి కట్టినా.. కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించి ముఖ్యమంత్రిగా రెండోసారి అధికారం చేపట్టిన వైఎస్సార్.. వాతావరణం అనుకూలంగా లేదని అధికారులు వారిస్తున్నా, చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హెలికాప్టర్‌లో బయలుదేరారు.

ఎప్పటిలాగే ఆయన సతీమణి విజయమ్మ చిరునవ్వుతో ఆయణ్ని ఇంటి నుంచి పంపించారు. తమ ప్రియతమ నేత కోసం చిత్తూరులో ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో పిడుగు లాంటి వార్త. ఉదయం 9.35 గంటలకు ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్నహెలికాప్టర్‌కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఆయన ఆచూకీ కోసం గాలింపు మొదలైంది. గంటలు గడుస్తున్నకొద్దీ తెలుగోడి గుండె కొట్టుకోవడం ఆగిపోతోంది.

12 గంటల తర్వాత ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు అధికారులు చెప్పారు. దీంతో ఆందోళన తీవ్రమైంది. 25 గంటల తర్వాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు లభించాయి. ప్రమాదస్థలం రుద్రకొండ కర్నూలు-ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు, వెలుగోడుకు సమీపంలోని నల్లమల అడవుల్లో ఉంది. ఆత్మకూరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో మరో 16 కిలోమీటర్లు దూరంలో హెలికాప్టర్ కూలిన ప్రాంతం ఉంది.

నాటి ప్రమాదంలో వైఎస్‌తో పాటు మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. మహానేత ఆనవాళ్లు కూడా లేకుండా శరీరం తునాతునకలైంది. తమ అభిమాన నేత అస్తమయాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో 60 మందికి పైగా గుండెలు ఆగిపోయాయి. మరో 12 మంది మహానేత మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు.

Tags :
|
|

Advertisement