Advertisement

అన్నదాతకు మద్దతుగా యంగ్ క్రికెటర్...

By: chandrasekar Wed, 09 Dec 2020 7:48 PM

అన్నదాతకు మద్దతుగా యంగ్ క్రికెటర్...


గత కొద్దిరోజులుగా హస్తిన సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న అన్నదాతలకు పలువురు క్రీడా ప్రముఖులు మద్దతు తెలిపారు. తాజాగా జాతీయ స్థాయి క్రికెటర్‌ మన్‌దీప్‌ సింగ్‌ రైతులకు మద్దతివ్వడమేగాకుండా స్వయంగా అక్కడకి వెళ్లి ఆందోళనలో పాల్గొన్నారు. తన సోదరుడు హర్వీందర్‌ సింగ్‌, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి గత సోమవారం సాయంత్రం సింఘు సరిహద్దుకు వెళ్లిన మన్‌దీప్‌ మంగళవారం సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. అన్నదాతలతో పాటు రోడ్డుపై బైఠాయించి నిరసనలో భాగస్తులైనారు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా చెప్పిన మన్‌దీప్ రైతులు లేకపోతే మనకు ఆహారం ఉండదని, త్వరలోనే అన్నదాతల సమస్యలకు పరిష్కారం లభించాలని కోరుతున్నారు. ‘ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను చూసి చలించిపోయా. అందుకే వారికి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఈ మధ్యే మా నాన్నా చనిపోయారు. నాన్న బతికుంటే ఆయన కూడా వచ్చి ఆందోళనలో పాల్గొనేవారు’ అని మన్‌దీప్‌ మీడియాతో అన్నారు.

ఇటీవల యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో 28ఏళ్ల మన్‌దీప్‌ పంజాబ్‌ తరఫున ఆడాడు. ఆ సమయంలోనే మన్‌దీప్‌ తండ్రి, అథ్లెటిక్స్‌ మాజీ కోచ్‌ హర్‌దేవ్‌ సింగ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. తండ్రి మరణవార్త తెలిసినా ఆ బాధను దిగమింగుకుని మ్యాచ్‌ ఆడి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. రైతుల ఆందోళనకు ఇప్పటికే ప్రముఖ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ సహా పలువురు క్రీడాప్రముఖులు మద్దతు తెలిపారు.

Tags :
|

Advertisement