Advertisement

  • కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

By: Sankar Fri, 16 Oct 2020 11:05 AM

కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ


కరోనాతో ప్రపంచం మొత్తం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.. అంతా కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నారు.. అదిగో.. ఇదిగో.. అంటూ అంతా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ కోసం.. పలుదేశాల్లో ట్రయల్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, 2021 వరకు ఒక్క వ్యాక్సిన్‌ అయినా అందుబాటులోకి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే, అది తక్కువ మోతాదులో అందుబాటులో ఉంటుందని అభిప్రాయపడింది. దీంతో అందరికీ ఒకేసారి పంపిణీ చేయడం సాధ్యం కాకపోవచ్చని తెలిపింది.

వైర‌స్ వ‌ల్ల రిస్క్‌లో ఉన్న హెల్త్ వ‌ర్కర్లకు ముందుగా టీకా అందుతుంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథ‌న్ తెలిపారు. ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా ప‌లు రకాల క‌రోనా టీకా ట్రయ‌ల్స్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని, ముందుగా ఎవ‌రికి టీకా ఇవ్వాల‌న్న అంశంపై చ‌ర్చలు జ‌రుగుతున్నాయని ఆమె చెప్పారు. 2021 వ‌ర‌కు క‌నీసం ఒక్క వ్యాక్సిన్ అయినా వ‌స్తుంద‌ని ఆమె అన్నారు. కానీ, ఆ టీకా చాలా త‌క్కువ మోతాదులో అందుబాటులో ఉంటుంద‌న్నారు. కరోనాపై ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వారియర్స్‌కు ముందుగా టీకా ఇవ్వాల్సి ఉంటుందని.. అందుకోసం చాలా మంది అంగీక‌రించారని తెలిపింది.

ఆరోగ్యంగా ఉన్నవాళ్లు, యువతీయువకులు 2022 వ‌ర‌కు క‌రోనా టీకా కోసం వేచి చూడాల్సి ఉంటుంద‌ని స్వామినాథన్‌ చెప్పారు. కరోనా వారియర్స్‌లోనూ ముందుగా ఎవరికి వ్యాక్సిన్‌ ఇవ్వాల‌న్న అంశాన్ని కూడా చర్చిస్తున్నట్టు.. డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. వారి తర్వాత వృద్ధుల‌కు.. కరోనా టీకా ఇవ్వనున్నారు. త్వరలోనే క‌రోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి మార్గద‌ర్శకాలు రానున్నాయి.

Tags :

Advertisement