Advertisement

  • కార్మికులు లేక పారిశ్రామిక రంగం మరింత ఇబ్బందుల్లో

కార్మికులు లేక పారిశ్రామిక రంగం మరింత ఇబ్బందుల్లో

By: chandrasekar Tue, 25 Aug 2020 08:54 AM

కార్మికులు లేక పారిశ్రామిక రంగం మరింత ఇబ్బందుల్లో


కరోనా కారణంగా పరిశ్రమలు విలవిలలాడుతున్నాయి. కార్మికులు లేక పారిశ్రామిక రంగం మరింత ఇబ్బందుల్లో పడడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రపంచం మొత్తం కరోనా ఎఫెక్ట్‌ పారిశ్రామిక రంగంపై తీవ్రంగానే పడింది. లాక్‌డౌన్‌ మినహాయింపులతో పరిశ్రమలు తెరుచుకున్నా కూడా కార్మికుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఇది ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపిస్తున్నది. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో మొత్తం 31 యంత్రాలు ఉన్నాయి. 31 మంది పనిచేస్తేనే ఒక వస్తువు తయారవుతుంది. కానీ అక్కడ ఆరుగురు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. కేవలం ఆరు యంత్రాలే నడుస్తున్నాయి. ఇక్కడ మరో పరిశ్రమదీ కూడా అదే పరిస్థితి. కాంట్రాక్టర్‌ ద్వారా 15 మందిని పనిలో పెట్టుకున్నా వసతి, భోజనాన్ని సమకూర్చినా కొవిడ్‌ భయంతో కార్మికులు విధులకు రాకుండా తమ తమ సొంత ఊర్లకు వెళ్లి పోతున్నారు. పరిశ్రమలను ఎదో రకంగా నడిపించడానికి బయటి నుంచి కార్మికులు వచ్చే అవకాశం లేకపోవడంతో స్థానికుల కోసం వేట ప్రారంభించారు.

వివిధ రకాలైన చిన్న పరిశ్రమల నుండి పెద్ద ఫార్మా పరిశ్రమల్లోని యంత్రాలు, బాయిలర్లు, ఫర్నేసులను నడుపాలంటే నైపుణ్యం ఉన్న కార్మికులతోనే సాధ్యమవుతుంది. నైపుణ్యమున్న ఒక కార్మికుడు, ఆపరేటర్‌ వద్ద సహాయకులుగా 4 నుండి 6 మంది పనిచేయాలి. అప్పుడే పూర్తిస్థాయి ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఇక ఇంజినీరింగ్‌, ఉత్పాదక రంగాల్లో ఆపరేటర్‌ కింద కనీసం నలుగురు హెల్పర్లు ఉండాలి. కార్మికులు లేక ఇబ్బందులు వస్తుండటంతో పరిశ్రమలు స్థానికులపై దృష్టి పెట్టాయి. లేబర్‌ కాంట్రాక్టర్లను రంగంలోకి దించి, జాబ్‌మేళాలను నిర్వహించి ఉద్యోగాలిస్తామంటూ రమ్మంటున్నాయి. అయినా ఎవరూ ముందుకు రావడం లేదని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. కరోనా ఎఫెక్ట్‌ నుంచి పారిశ్రామిక రంగం ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్నది. కొన్ని పరిశ్రమలు 30-40 శాతం వరకు ఉత్పత్తిని ప్రారంభించగా, మరికొన్ని 60 శాతం వరకు ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ముఖ్యంగా కార్మికుల సమస్య ఈ రంగాన్ని పీకల్లోతు కష్టాల్లోకి నెడుతున్నది. ఎక్కడ చూసినా కార్మికులు, సూపర్‌వైజర్లు కావాలి అన్న బోర్డులే దర్శనమిస్తున్నాయి. మరికొన్ని పరిశ్రమలు ఉన్న కొద్ది మందితోనే నెట్టుకొస్తున్నాయి. దీంతో పరిశ్రమల నిర్వహణ భారంగా మారింది.

ఈ కరోనా వల్ల ఏమి చేయలేని పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలంతా కష్టాల నుంచి బయటపడేదెలా అని మధనపడుతున్నారు. ఇప్పటికే ఆరు మాసాలు ఇదే రకంగా గడిచి పోగా, ఈ ఏడాదంతా ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌ చుట్టు పక్కల ఉన్న పారిశ్రామికవాడల్లో సుమారు 5వేల వరకు పరిశ్రమలున్నాయి. ఇవే కాకుండా మరో లక్ష వరకు సూక్ష్మ, చిన్న తరహా కంపెనీలున్నాయి. వీటిల్లో లక్షలాది మంది పనిచేసే వారు. వీరంతా వలస కూలీలే కావడం గమనార్హం. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ తదితర 16 రాష్ట్రాలకు చెందిన వారంతా హైదరాబాద్‌లో కూలీలుగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాల వారు సైతం ఇక్కడే ఉపాధి పొందుతున్నారు. లాక్‌డౌన్‌తో వీరంతా సొంతూళ్ల బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్‌ రైళ్ల ద్వారా స్వస్థలాలకు వెళ్లిపోయారు. అయితే లాక్‌డౌన్‌ మినహాయింపుల్లో పరిశ్రమలను తెరిచి, ఉత్పత్తి ప్రారంభించే అవకాశమిచ్చారు. కానీ అంతర్రాష్ట్ర రవాణాకు అవకాశమివ్వలేదు. దీంతో వెళ్లిపోయిన వారంతా అక్కడే చిక్కుకుపోయారు. వీరు తిరిగి రావాలంటే రాష్ట్రల మధ్య బస్సులు, రైళ్లను తిరిగి ప్రారంభిస్తేనే సాధ్యమని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. అప్పుడే సంక్షోభం నుంచి గట్టెక్కగలమని చెబుతున్నారు. రవాణా వ్యవస్థ తిరిగి పునరుద్ధరించినట్లైతే వేరు వేరు రాష్ట్రాలనుండి కార్మికులు ఇక్కడకు చేరుకోవడం ద్వారా పరిస్థితి తిరిగి యధా స్థితికి చేరుకుంటుందని భావిస్తున్నారు.

Tags :
|

Advertisement