Advertisement

  • లద్ధఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా, భారత్ బలగాల ఉపసంహరణ

లద్ధఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా, భారత్ బలగాల ఉపసంహరణ

By: chandrasekar Thu, 09 July 2020 11:04 AM

లద్ధఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా, భారత్ బలగాల ఉపసంహరణ


తూర్పు లద్ధఖ్‌లోని గల్వాన్ లోయలో గత కొన్ని వారాలుగా నెలకొన్న ఉద్రిక్త వాతావరణం చైనా, భారత్ బలగాల ఉపసంహరణతో చల్లబడింది. చైనా విదేశాంగ మంత్రితో భారత జాతీయ భద్రతా సలహాదారుడు దోవల్ జరిపిన చర్చలు ఫలించి ఇరు దేశాలు తమ బలగాలను అక్కడి నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకోవడం తెలిసిందే.

ఆ మేరకు భారత్-చైనా సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతాల నుంచి ఇరు దేశ బలగాల ఉపసంహరణ ప్రక్రియ ముగిసినట్లు భారత సైనిక వర్గాలు ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపాయి. గల్వాన్ లోయ‌లోని గస్తీ పాయింట్ 14 నుంచి చైనా తన బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంది. తమ సామాగ్రిని పూర్తిగా తొలగించింది.

తూర్పు లద్ధఖ్‌లోని మరో రెండు వివాదాస్పద ప్రాంతాలైన హాట్ స్ప్రింగ్స్, గోగ్రా కూడా చైనా సేనలు వెనక్కి వెళ్లాయి. భారత్ కూడా తన బలగాలను ఆ ప్రాంతాల నుంచి ఉపసంహరించుకుంది. వివాదాస్పద ప్రాంతాల నుంచి సైనిక బలగాల ఉపసంహరణకు సంబంధించి ఇరు దేశాల మధ్య సైనికాధికారులు, దౌత్య అధికారుల స్థాయి చర్చలు పలు విడతలుగా జరిగాయి. చివరకు చైనా విదేశాంగ మంత్రితో దోవల్ టెలిఫోన్‌లో దాదాపు 2 గం.ల పాటు జరిపిన చర్చలు ఫలించి..ఇరు దేశాలు తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నాయి.

ఆ మేరకు చైనా సేనలు రెండు కిలో మీటర్లు వెనక్కి వెళ్లినట్లు శ్యాటిలైట్ ఫోటోల ద్వారా నిర్ధారణ అయ్యింది. చర్చల్లో నిర్ణయించిన మేరకు సైనిక సేనల ఉపసంహరణలో కీలక పురోగతి సాధించినట్లు చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జవో లిజియాన్ మీడియాకు తెలిపారు. చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయాన్ని భారత్ ఆచరణలో పెడుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు. గల్వాన్ లోయలో గత నెల 15న ఇరు దేశ సేనల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల్లో కల్నన్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత జవాన్లు మృతి చెందడం తెలిసిందే. ఈ ఘర్షణల్లో చైనా వైపు దాదాపు 40 మంది సైనికులు చనిపోయినట్లు అనధికారిక వర్గాల సమాచారం.

Tags :
|

Advertisement