Advertisement

  • దుబే విషయంలో ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడంలేదు: రాహుల్ గాంధీ

దుబే విషయంలో ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడంలేదు: రాహుల్ గాంధీ

By: chandrasekar Sat, 11 July 2020 10:35 AM

దుబే విషయంలో ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడంలేదు: రాహుల్ గాంధీ


'వికాస్ దుబే' ఉత్తరప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎన్‌కౌంటర్‌పై దేశ వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. వికాస్ దుబేకు సహకరించిన అధికారులు, నాయకులపై ఏం చర్యలు తీసుకుంటారంటూ ప్రతిపక్షాలన్నీ యూపీ బీజేపీ ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయి. 8న కాన్పూర్‌లో 8 మంది పోలీసులను దారుణంగా హత్య చేసిన వికాస్ దుబే మధ్యప్రదేశ్ ఉజ్జయిని వరకు ఎలా చేరుకున్నాడని, ఎవరి ప్రమేయం లేకుండానే ఆయన అక్కడి వరకు చేరుకుని ఉంటాడా అంటూ బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు గుప్పిస్తున్నాయి.

వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై ఎన్నో ప్రశ్నలు, అనుమానాలనున్నాయని సుప్రీం కోర్టు జడ్జీతో విచారణ చేపట్టి నిజాలను బయటకు తీయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వికాస్ దుబే ఎన్‌కౌంటర్ జరిగినప్పటి నుంచి కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేసి మరో ఆసక్తికర పరిణామానికి తెరలేపారు. ‘‘చాలా సమాధానాలకంటే కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మంచిది’’ అంటూ దుబే ఎన్‌కౌంటర్‌ను ఉద్దేశిస్తూ రాహుల్ ట్వీట్ చేశారు.

దుబే విషయంలో ప్రభుత్వం ఎందుకు సమాధానాలు చెప్పడంలేదు. ఎందుకు మౌనం వహిస్తోంది. సమాధానాలు చెప్పకుండా మౌనమే మేలు అనుకుంటుందా అంటూ ఆయన పరోక్షంగా ప్రశ్నలు సంధించారు. అంతకుముందు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా దుబే ఎన్‌కౌంటర్‌పై యూపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. యూపీలో రాజకీయ నాయకులు, గ్యాంగ్‌స్టర్లు చేతులు కలిపారని ఆమె ట్వీటర్లో ఆరోపించారు. నేరస్థుడు హతమయ్యాడు. మరి ఆయనకు రక్షణ కల్పించిన వారి సంగతేంటి అంటూ ప్రియాంక పలువురు కాంగ్రెస్ నాయకులు ట్విటర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం దుబే ఎన్‌కౌంటర్‌ విషయంలో యోగి ప్రభుత్వంపై పలు ప్రశ్నలు గుప్పించారు. వికాస్ దుబే కారు బోల్తా పడలేదని, నిజాలు బయటకు రాకుండా కావాలనే ఇలా చిత్రీకరించారంటూ ఆయన ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని, నేరస్థులు రాజకీయ నేతల మధ్య ఉన్న సంబంధాలను చట్టం ముందుకు తీసుకురావాలంటూ బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయవతి డిమాండ్ చేశారు.

మరణించిన వ్యక్తులు ఇంకా కథలు చెప్పరంటూ జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనపై పరోక్షంగా ట్వీట్ చేశారు. ఇదిలాఉంటే ప్రతిపక్షాల విమర్శలను బీజేపీ ఖండించింది. చట్టం తనపని తాను చేసుకుపోతుందని, పోలీసులు వారి బాధ్యతను నిర్వహించారని వెల్లడించింది.

Tags :
|

Advertisement