Advertisement

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో?

By: Dimple Mon, 24 Aug 2020 12:15 PM

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో?

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షపదవినుంచి తనను తప్పించమని సోనియాగాంధీ కోరుతోంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు మాత్రం గాంధీ కుటుంబంనుంచి కాంగ్రెస్‌ పదవీబాధ్యతల్లో ప్రాతినిధ్యం ఉండాలని పట్టుబడుతున్నారు. రాహుల్‌ గాంధీ మాత్రం తనకు అధ్యక్ష పదవి వద్దంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో నాయకత్వ సంక్షోభం తీవ్రమైన విషయం తెలిసిందే. దీనిపై చర్చించేందుకు మరికాసేపట్లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) కీలక భేటీ కానుంది. పార్టీ పగ్గాలను ఎవరికి అప్పగించాలనే దానిపై కీలక చర్చ జరుగనుంది.
పార్టీ అధ్యక్షురాలిగా తాను కొనసాగనని సోనియాగాంధీ ప్రకటించినట్లు సమాచారం. దీంతో అధ్యక్ష పదవిని తిరిగి రాహుల్‌ గాంధీకి అప్పగిస్తారా? లేక ఇతరుల చేతిలో పెడతారా? అనే విషయంపై స్పష్టత రానుంది. అయితే, గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని కొందరు నాయకులు అభిప్రాయపడుతుంటే, గాంధీ కుటుంబ నాయకత్వంపైనే తమకు విశ్వాసం ఉందని మరికొందరు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు జరగబోయే సీడబ్ల్యూసీ భేటీపై ఉత్కంఠ నెలకొంది
పార్టీ నాయకత్వంపై ఓ నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సోనియా గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి ప్రతిస్పందనగా ముగ్గురు సీఎంలు, 50మంది ఎంపీలు, 30మంది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, 500మందికిపైగా ఎమ్మెల్యేలు సోనియా గాంధీకి మరో లేఖ రాసినట్లు ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.
గాంధీ కుటుంబ నాయకత్వంపైనే తమకు విశ్వాసం ఉన్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. సోనియాగాంధీ లేదా రాహుల్‌గాంధీ మాత్రమే కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వం వహించాలని ఆయా లేఖల్లో స్పష్టం చేసినట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్‌ పార్టీకి మరెవరూ న్యాయం చేయలేరని, కేవలం గాంధీ కుటుంబ సభ్యులే ఉండాలని సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ వాదనను ఆ లేఖలో వినిపించినట్లు సమాచారం.

Tags :
|

Advertisement