Advertisement

  • కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు ప్రకటించిన డబ్ల్యూహెచ్‌ఓ

కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు ప్రకటించిన డబ్ల్యూహెచ్‌ఓ

By: chandrasekar Fri, 04 Dec 2020 5:24 PM

కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు ప్రకటించిన డబ్ల్యూహెచ్‌ఓ


వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వాక్సిన్ ప్రస్తుతం అందుబాటులో లేక పోవడం వల్ల వీటికి ప్రత్యామ్నాయంగా మార్గదర్శకాలను డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడేందుకు రోగనిరోధక శక్తిని పెంచడం, నిర్ణీత దూరం పాటించడం ఉత్తమ ఆయుధాలుగా పేర్కొన్నారు. ప్రపంచ జనాభాకు ఇంకా సమర్థవంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్ అందుబాటులో లేనప్పుడు, నిర్దిష్ట చికిత్సలు లేకపోవడంతో వైరస్ నుంచి నివారణకు గతంలో మాదిరిగా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించడమే ఒక్కటే చక్కటి మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంటున్నది. ప్రజల మధ్య వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి కొన్ని ప్రభావవంతమైన మార్గాలుగా నిర్ణీత దూరం పాటించడం, చేతులు శుభ్రపర్చుకోవడం, సరైన శ్వాసకోశ పరిశుభ్రత, ఫేస్ మాస్క్‌లు లేదా ఫేస్ కవర్లు ధరించాలని డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు చేసింది. కొవిడ్‌-19 ను నివారించడానికి ఫేస్ మాస్క్‌ల వాడకానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మరికొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. పేలవమైన వెంటిలేషన్ ప్రదేశాలలో, ఇంటి లోపల మాస్క్‌లు వాడటం ముఖ్యమైనదిగా పేర్కొన్నది. సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ ద్వారా కరోనావైరస్ వ్యాప్తి చెందుతుందన్న విషయాలు గతంలో వచ్చాయి.

అంతే కాకుండా పేలవమైన వెంటిలేషన్, కార్లు లేదా చిన్న గదులు వంటి ఎయిర్ కండిషన్డ్ ప్రదేశాలలో వైరస్ గాలి గుండా ప్రయాణించి ఆరోగ్యకరమైన వ్యక్తులలో సంక్రమణకు కారణమవుతుంది. అందువల్ల, ఇంట్లో ఉన్నప్పుడు, బహిరంగ స్థలాల్లో ఉన్న సందర్భాల్లో కూడా మాస్క్‌ ధరించడం శ్రేయస్కరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్నది. వైరల్ సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి నాణ్యమైన మాస్క్‌లను ఉపయోగించడం చాలా మంచిదని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పుకొచ్చింది. అలాగే వ్యాయామం చేసేటప్పుడు ఫేస్ మాస్క్‌లను వాడకుండా చూడాలని సలహా ఇస్తున్నది. వ్యాయామశాలలో ఫేస్ మాస్క్ ధరించాల్సిన అవసరం లేనప్పటికీ సరైన వెంటిలేషన్, నిర్ణీత దూరాన్ని నిర్ధారించడం చాలా ముఖ్యమని ఆరోగ్య సంస్థ పునరుద్ఘాటించింది. ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలని, తప్పనిసరిగా విందులు, కార్యక్రమాల్లో హాజరుకావాల్సి వచ్చినప్పుడు బృంద సభ్యులు దూరంగా ఉంటూ మాస్క్‌లు ధరించాలి. అదేవిధంగా, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవడం, శానిటైజర్లు వాడటం, కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లగానే స్నానం చేయడం వంటివి చేయడం ద్వారా కొవిడ్‌-19 వ్యాప్తి చెందకుండా చూసుకోవచ్చునని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది. సాంఘీక దూరం పాటించడం మరియు మాస్కులు ధరించడం వల్ల వైరస్ బారి నుండి బయటపడవచ్చని తెలిపింది.

Tags :
|

Advertisement