Advertisement

ఏలూరులో ఏం జరుగుతోంది?

By: chandrasekar Mon, 07 Dec 2020 12:02 PM

ఏలూరులో ఏం జరుగుతోంది?


పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రెండు, మూడు రోజులుగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఎందుకు వందల మంది మూర్ఛతో పడిపోతున్నారని ఎందుకు డాక్టర్లు ఈ వింత వ్యాధికి కారణం చెప్పలేకపోతున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నల మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఏలూరు వెళ్తున్నారు. ముందుగా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. ఆ తర్వాత స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం అవుతారు. వ్యాధికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. అలాగే... బాధితులకు అందుతున్న చికిత్సలు, మరింత మందికి వ్యాధి సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుసకుంటారు. మొత్తం పరిస్థితిని సమీక్షిస్తారు. ఈ అంతుచిక్కని వ్యాధి వల్ల మూడు రోజుల్లో 300 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. వారిలో ఒకరు చనిపోయారు. అసలు ఇది ఏ వ్యాధో డాక్టర్లకే తెలియట్లేదు. దాంతో ఇది వింత వ్యాధి అనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాధి పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ సోకుతోంది. ఇది వచ్చిన వారు... అప్పటివరకూ బాగానే ఉంటూ... సడెన్‌గా మూర్చ వచ్చినట్లు పడి గిలగిలా కొట్టుకుంటున్నారు. కానీ వాస్తవానికి అది ఫిట్స్ కానే కాదు. కానీ అలాంటి లక్షణం కనిపిస్తోంది. ఇలా విలవిలా కొట్టుకుంటున్నప్పుడు వారి నోటి నుంచి నురగ లాగా వస్తోంది. ఆ సమయంలో వారు స్పృహ కోల్పోతున్నారు. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లాక... కోలుకుంటున్నారు. ఐతే... అలా కోలుకున్న వారు మళ్లీ మళ్లీ అదే సమస్య బారిన పడుతున్నారు. అలా రిపీటెడ్‌గా జరగని వారిని మాత్రం డిశ్చార్జి చేస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ప్రత్యేక నిపుణుల బృందం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. వాటర్ వల్ల ఇలా జరిగి ఉంటుందా అన్న అనుమానాన్ని ఏలూరు డాక్టర్లు తోసిపుచ్చారు.

ప్రాథమిక పరీక్షల్లో నీటి వల్ల ఇలా జరగలేదని తేల్చారు. అందువల్ల 50 మంది పేషెంట్ల... వెన్నెముక నుంచి ద్రవాన్ని సేకరించారు. ఆ శాంపిల్స్‌ని విజయవాడ, విశాఖపట్నంలోని ల్యాబ్‌లకు పంపారు. ఆ రిపోర్టులు వస్తే గానీ కారణం చెప్పలేమంటున్నారు. గాలిలో గానీ, పాలలో గానీ వాయువులు, రసాయనాల వంటివి కలిశాయా అన్న కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ఇదో రకమైన సామూహిక భయం వల్ల వస్తోంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. అధికారులు బాధితుల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. అలాగే ఏలూలు నగరంలోని దక్షిణ వీధి, శనివారపుపేట, ఆదివారపుపేట, అరుంధతిపేట, పడమరవీధి, కొత్తపేట, అశోక్ నగర్, తంగెళ్లమూడి, తాపీమేస్త్రీ కాలనీ, అరుంధతిపేట ఇంటింటికీ ఆరోగ్య సర్వే చేస్తున్నారు. లక్షణాలు కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. టెస్టుల కోసం శాంపిల్స్‌ను అధికారులు వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఫిట్స్ లక్షణాలతో చేరిన బాధితులకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో అదనపు బెడ్‌లు ఏర్పాటు చేశారు. మంత్రి ఆళ్లనానితో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తాజా అనుమానాల ప్రకారం... ఆర్గానోక్లోరిన్ ఇందుకు కారణం కావచ్చంటున్నారు. దీన్ని పురుగు మందుల్లో వాడుతారు. కొన్ని సందర్భాల్లో ఇది పర్యావరణానికి చేటుచేస్తుందంటున్నారు. స్థానికులు వాడే పురుగుమందుల్లో ఇది ఉంటే... వాతావరణంలో ఇది చేరి... చుట్టుపక్కల మనుషులు, ప్రాణులపై చెడు ప్రభావం చూపుతుందనీ, విషపూరితం చేస్తుందని ఇదివరకు జరిపిన పరిశోధనల్లో తేలింది. వింత వ్యాధి సోకుతున్న ప్రాంతాల్లో ఈ కెమికల్ గాల్లో గానీ, నీటిలో గానీ కలిసిందా అన్నది తేలాల్సి ఉంది.

Tags :
|
|

Advertisement