Advertisement

తెలంగాణాలో మొదలయిన ఎంసెట్ వెబ్ ఆప్షన్స్

By: Sankar Mon, 19 Oct 2020 10:24 AM

తెలంగాణాలో మొదలయిన ఎంసెట్ వెబ్ ఆప్షన్స్


రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఆదివారం అర్ధరాత్రి తరువాత వెబ్‌ ఆప్షన్లు మొదలయ్యాయి. రాష్ట్రంలోని 176 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 97,741 సీట్లకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపును జారీ చేశాయి.

శనివారం ప్రభుత్వం కొత్త కోర్సుల్లో సీట్లకు ఆమోదం తెలుపగా, ఆదివారం మధ్యాహ్నం వరకు యూనివర్సిటీలు కొత్త కోర్సులతోపాటు పాత కోర్సులకు అనుబంధ గుర్తింపును జారీ చేస్తాయని ప్రవేశాల క్యాంపు అధికారులు, యాజమాన్యాలు ఎదురుచూశాయి. చివరకు ఆదివారం రాత్రి జేఎన్‌టీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపును ఇస్తూ కాలేజీల వారీగా బ్రాంచీలు, ఆయా బ్రాంచీల్లో సీట్ల వివరాలను ప్రవేశాల కమిటీలకు అందజేశాయి. కాలేజీల్లో ఫ్యాకల్టీ, వసతులను బట్టి 176 కాలేజీల్లో 97,741 సీట్లకు ఆమోదం తెలిపినట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ వెల్లడించారు..

దీంతో ప్రవేశాల క్యాంపు కార్యాలయం సీట్‌ మ్యాట్రిక్స్‌ రూపొందించి ఆదివారం అర్ధరాత్రి తరువాత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించింది. మొత్తం 176 కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో 69,365 సీట్లను (14 యూనివర్సిటీ కాలేజీల్లో వంద శాతం... 3,152 సీట్లు) భర్తీ చేయనుంది. కన్వీనర్‌ కోటాలో సీట్ల కోసం విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్‌ తెలిపారు.

అయితే ఆప్షన్లు ఇచ్చేప్పుడు కాలేజీల ప్రాధాన్యం పక్కాగా చూసుకోవాలని, తమకు నచ్చిన కాలేజీలు, బ్రాంచీలను ఎంచుకోవాలని సూచించారు. వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నారు. ఇక మరో 28,376 సీట్లను 30 శాతం మేనేజ్‌మెంట్‌ కోటాలో (అందులో 15 శాతం ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కోటా) యాజమాన్యాలు భర్తీ చేయనున్నాయి

Tags :

Advertisement