Advertisement

  • ఐపీఎల్ షెడ్యూల్‌ ఖరారు చేశాక ప్రణాళిక వెల్లడిస్తాం; ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌

ఐపీఎల్ షెడ్యూల్‌ ఖరారు చేశాక ప్రణాళిక వెల్లడిస్తాం; ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌

By: chandrasekar Thu, 23 July 2020 2:19 PM

ఐపీఎల్ షెడ్యూల్‌ ఖరారు చేశాక ప్రణాళిక వెల్లడిస్తాం; ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌


ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) వేదికగా నిర్వహించాలని అనుకుంటున్నట్లు టోర్నీ పరిపాలన మండలి చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ తెలిపాడు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరతామని, సీజన్‌ను పూర్తిస్థాయిలో జరుపాలనుకుంటున్నామని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. వచ్చే వారం లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే ఐపీఎల్‌ మండలి సమావేశంలో టోర్నీ తేదీలతో పాటు ప్రణాళికపై నిర్ణయం తీసుకుంటామని బ్రిజేశ్‌ చెప్పాడు.

ఈ ఏడాది అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15వ తేదీ వరకు జరుగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను కరోనా వైరస్‌ తీవ్రత కారణంగా ఐసీసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో నిరవధికంగా వాయిదా వేసిన ఐపీఎల్‌ను ఆ సమయంలో నిర్వహించేందుకు బీసీసీఐకి మార్గం సుగమమైంది. ‘వేదికను యూఏఈగా నిర్ణయించుకున్నాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే తేదీలను ఖరారు చేస్తాం. ఇంకా షెడ్యూల్‌ నిర్ణయించలేదు. పరిపాలన మండలి వచ్చే వారం, పదిరోజుల్లో సమావేశమవుతుంది. అప్పుడు ప్రకటిస్తాం’ అని బ్రిజేశ్‌ చెప్పాడు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 26 నుంచి నవంబర్‌ 8వ తేదీ వరకు 60 మ్యాచ్‌లతో ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే ప్రాథమిక షెడ్యూల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం.

మౌళిక సదుపాయాలు;

కరోనా కారణంగా ఆంక్షలు ఉన్నా యూఏఈలో ఐపీఎల్‌ నిర్వహించేందుకు పెద్దగా సవాళ్లు ఎదురుకావని అనుకుంటున్నామని బ్రిజేశ్‌ పటేల్‌ అన్నాడు. ఆ దేశంలో మౌళిక సదుపాయాలు, వసతులు, హోటళ్లు సరిపడా ఉన్నాయని చెప్పాడు. ఇంతకు ముందు అక్కడ ఐపీఎల్‌ జరిపిన కారణంగా వసతులపై పూర్తి అవగాహన ఉందని అన్నాడు. ‘ఐపీఎల్‌కు ఆతిథ్యమిచ్చేందుకు యూఏఈ ఇప్పటికే ముందుకొచ్చింది. తేదీలు ఖరారు చేశాక ఆ దేశ బోర్డుకు సమాచారమిస్తాం. సుదీర్ఘ విరామంలో ఉన్న ఆటగాళ్లు టోర్నీలో పోటీ పడేందుకు కనీసం మూడు వారాల ట్రైనింగ్‌ అవసరమవుతుంది. షెడ్యూల్‌ ఖరారు చేశాక ప్రణాళిక వెల్లడిస్తాం’ అని బ్రిజేశ్‌ చెప్పాడు. సార్వత్రిక ఎన్నికల కారణంగా 2014 ఐపీఎల్‌లో తొలి 20మ్యాచ్‌లను యూఏఈలోనే బీసీసీఐ నిర్వహించింది.

‘ఐసీసీ ఇప్పటికే మార్గదర్శకాలను ప్రకటించింది. మేం కూడా ఎస్‌వోపీని త్వరలోనే ప్రకటిస్తాం. ఆటగాళ్ల భద్రత, క్షేమమే మాకు అత్యంత ముఖ్యం’ అని బ్రిజేశ్‌ స్పష్టం చేశాడు. అలాగే యూఏఈలో మ్యాచ్‌లకు ప్రేక్షకులను పరిమిత స్థాయిలో అనుమతించాలా అన్న విషయంపై ఇంకా ఏం ఆలోచించడం లేదని, ఈ అంశంపై ఆ దేశంతో చర్చిస్తామని చెప్పాడు.

Tags :
|
|

Advertisement