Advertisement

కరోనా టెస్టింగ్ సామర్ధ్యం పెంచాలి ..పీఎం మోడీ

By: Sankar Wed, 17 June 2020 7:35 PM

కరోనా టెస్టింగ్ సామర్ధ్యం పెంచాలి ..పీఎం మోడీ



కరోనా వైరస్‌ పరీక్షలను ముమ్మురంగా చేపట్టేందుకు టెస్టింగ్‌ సామర్ధ్యం పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆరోగ్య మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు మహమ్మారి బారిన పడిన వారి పట్ల వివక్ష చూపడం తగదని పలు రాష్ట్రాల సీఎంలతో బుధవారం రెండోరోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ కట్టడితో పాటు జూన్‌ 30తో లాక్‌డౌన్‌ ముగియనుండటంతో చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని రాష్ట్రాల సీఎంలతో చర్చించారు. కోవిడ్‌-19 బారినపడి కోలుకునే వారిసంఖ్య పెరగడం వైరస్‌ వ్యాప్తి కట్టడికి సానుకూల సంకేతమని అన్నారు.

దేశవ్యాప్తంగా 900కిపైగా టెస్టింగ్‌ ల్యాబ్‌లున్నాయని, లక్షల సంఖ్యలో కోవిడ్‌ పడకలు, వేలాది క్వారంటైన్‌ కేంద్రాలు, ఐసోలేషన్‌ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, సరిపడా ఆక్సిజన్‌ సిలిండర్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రజల్లో నాటుకుపోయిన ఇన్ఫెక్షన్‌ భయాన్ని మనం పారద్రోలాలని అన్నారు. కరోనా వైరస్‌నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు కోలుకుంటున్న క్రమంలో వారు భయపడాల్సిన అవసరం లేదని ప్రధాని పేర్కొన్నారు.
ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చినప్పుడు విధిగా ముఖానికి మాస్క్‌లు ధరించాలని, ఇన్ఫెక్షన్‌ సోకకుండా తరచూ శానిటైజర్లతో చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కొన్ని నగరాలు జనసమ్మర్ధంతో నిండిపోయి భౌతిక దూరాన్ని పాటించకపోవడంతో ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్‌తో పోరు సవాళ్లతో కూడుకున్నదని ప్రధాని పేర్కొన్నారు.


Tags :
|
|
|

Advertisement