Advertisement

  • కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తాం: కేసీఆర్

కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తాం: కేసీఆర్

By: chandrasekar Sat, 20 June 2020 10:16 AM

కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తాం: కేసీఆర్


భారత-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని, అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానమంత్రికి సూచించారు.

ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పుడు కావల్సింది రాజకీయం కాదని, యుద్ధనీతి కావాలని చెప్పారు.

భారతదేశంలో పరిపాలన సుస్థిరంగా ఉండడంతో పాటు, గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడం ఓర్వలేకనే చైనా కయ్యానికి కాలుదువ్వుతున్నదని సిఎం అభిప్రాయపడ్డారు. గాల్వన్ లోయలో వీర మరణం పొందిన సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అందించే సాయాన్ని కూడా సిఎం ప్రకటించారు.

ప్రధానమంత్రి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభంలో గాల్వన్ లోయ ఘటనలో మరణించిన సైనికులకు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ తన అభిప్రాయాలు చెప్పారు.

చైనా, పాకిస్తాన్ దేశాలకు తమ దేశాల్లో అంతర్గత సమస్యలున్నప్పుడు సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం సృష్టించడం అలవాటు. ఇప్పుడు చైనాలో కూడా అంతర్గత సమస్యలున్నాయి. దక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్, జపాన్ తదితర దేశాలతో కూడా చైనా ఘర్షణలకు దిగుతున్నది.

fully,supporting,central,government,kcr ,కేంద్ర ,ప్రభుత్వానికి, తాము పూర్తి, అండగా ,నిలుస్తాం కేసీఆర్


చైనా వైఖరి ప్రపంచ వ్యాప్తంగా బాగా అపఖ్యాతి పాలయింది. చైనా ఇటీవల కాలంలో భారతదేశంతో ఘర్షణాత్మక వైఖరి అవలంభిస్తున్నది. దానికి ప్రత్యేక కారణాలున్నాయి. కాశ్మీర్ విషయంలో కొత్త చట్టాలు తెచ్చాం.

అక్కడి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం. పివోకె గురించి గట్టిగా మాట్లాడుతున్నాం. ఆక్సాయ్ చిన్ మనదే అని, అది చైనా ఆక్రమించిందని పార్లమంటులోనే మన కేంద్ర మంత్రి ప్రకటించారు. గాల్వన్ లోయ దేశ రక్షణ విషయంలో స్ట్రాటజిక్ పాయింట్. అక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. ఇది చైనాకు నచ్చడం లేదు. అందుకే ఘర్షణాత్మక వైఖరి అవలంభిస్తోంది.

‘‘మనది శాంతికాముక దేశం. అదే సమయంలో సహనానికి హద్దు ఉంటుంది. ఎవరైనా మన మీదకి వస్తే తీవ్రంగా ప్రతిఘటించాలి. దేశ రక్షణ, ప్రయోజనాల విషయంలో రాజీ పడవద్దు. ఈ పరిస్థితుల్లో రాజకీయం అవసరం లేదు. రణనీతి కావాలి. దేశమంతా ఒక్కతాటిపై నిలబడాల్సిన సమయం ఇది. దేశమంతా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి అండగా నిలవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు ఈ సమయంలో దేశ ప్రధానికి అండగా ఉంటారు’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఆత్మ నిర్భర్ భారత్ కావాలని మనం కోరుకుంటుంటే చైనా మాత్రం అన్య నిర్భర్ భారత్ కావాలని ఆకాంక్షిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. మన దేశం ఎదగడం చైనాకు ఇష్టం లేదన్న ఆయన భారతదేశంలో సుస్థిరమైన ప్రభుత్వం, స్థిరంగా ఆర్థికాభివృద్ధి జరగడాన్ని ఆ దేశం ఓర్వలేకపోతున్నదని అఖిలపక్ష సమావేశంలో పేర్కొన్నారు. అందుకే ఈ గొడవలు సృష్టిస్తోందని మండిపడ్డారు సీఎం కేసీఆర్.

‘‘భారత్ తో చైనా ఘర్షణాత్మక వైఖరి కొనసాగిస్తున్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కోవడానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు వద్దు. అదే సమయంలో ఎవరికీ తలవంచొద్దు. రక్షణ వ్యవహారాలలో మిత్రదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలి. బ్రిటన్ ప్రతిపాదించిన డి 10 గ్రూపులో కలవాలి. ఓరాన్ అలయెన్సులో చేరాలి. హువాయ్ కంపెనీ ఎత్తుగడను తిప్పికొట్టాలి. మనం వ్యూహాత్మకంగా వ్యవహరించాలి’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.

చైనా నుంచి వస్తువుల దిగుబడి ఆపాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని అది తొందరపాటు చర్య అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న వస్తువులు మన దేశంలోనే తయారు కావాలి. ప్రజలకు సరసమైన ధరల్లో వస్తువులు దొరకాలి. ముందుగా మనం ఈ విషయాలపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్అ సూచించారు.

Tags :
|

Advertisement