Advertisement

నేడే దుర్గగుడి ప్లై ఓవర్ ప్రారంభోత్సవం...!

By: Anji Fri, 16 Oct 2020 07:23 AM

నేడే దుర్గగుడి ప్లై ఓవర్ ప్రారంభోత్సవం...!

విజయవాడ నగర వాసుల చిరకాల కోరిక తీరబోతోంది. ఎప్పుడెప్పుడా అని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న దుర్గగుడి ప్లై ఓవర్ ప్రారంభోత్సవం నేడు జరగనుంది.. అనేకసార్లు వాయిదాలు పడుతూ వచ్చిన ఫ్లైఓవర్‌ ఎట్టకేలకు నేడు ప్రారంభం కానుంది.

ఈరోజు ఉదయం 11.30కు వర్చువల్‌ పద్ధతిలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, ఏపీ సీఎం జగన్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పరిశీలించారు.

ఇప్పటికే దుర్గగుడి ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం రెండుసార్లు వాయిదా పడింది.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణంతో ఓసారి వాయిదా పడగా.. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి కరోనా సోకడంతో సెప్టెంబరు 4న జరగాల్సిన ప్రారంభోత్సవ కార్యక్రమం పోస్టుపోన్‌ అయింది..

ఇప్పుడు కరోనా నుంచి కోలుకున్న ఆయన ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొంటారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా 61 కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పాల్గొంటారు.. 15వేలా 592 కోట్ల రూపాయల అంచనాలతో 61 ప్రాజెక్టులు రూపుదిద్దుకోనున్నాయి.

దుర్గగుడి ఫ్లైఓవర్‌ను ఇంజినీరింగ్‌ అద్భుతంగా భావిస్తున్న కేంద్రం.. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా డ్రోన్‌ బృందాన్ని విజయవాడకు రప్పించి ఫ్లైఓవర్‌ అందాలను దేశ ప్రజలకు చూపించింది.. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు.. ఫ్లైఓవర్‌ డాక్యుమెంటరీని జాతీయ మీడియాలో ప్రసారం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

స్పైన్‌ అండ్‌ వింగ్స్‌ టెక్నాలజీతో నిర్మించిన ఫ్లైఓవర్‌ ప్రత్యేకతను చాటిచెప్పాలని భావిస్తోంది. ఒంటి స్తంభంపై ఆరు వరసలతో మూడు కిలోమీటర్ల పొడవుతో నిర్మించడం ఫ్లైఓవర్‌ ప్రత్యేకతగా నిలుస్తోంది. ఇలాంటి ఫ్లైఓవర్లు ఢిల్లీ, ముంబయిలో ఉన్నాయి.

వాటి తర్వాత విజయవాడలోనే ఈ తరహా ఫ్లైఓవర్‌ నిర్మించారు. ఢిల్లీ, ముంబయి ఫ్లైఓవర్ల కంటే కూడా అడ్వాన్స్‌ టెక్నాలజీతో దుర్గగుడి ఫ్లైఓవర్‌ను నిర్మించారు. దేశంలోని అతి పొడవైన ఆరు వరసల ఫ్లైఓవర్‌ కావటం ప్రత్యేకతగా నిలుస్తోంది.

Tags :

Advertisement