Advertisement

  • కేసీఆర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి...

కేసీఆర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి...

By: chandrasekar Fri, 13 Nov 2020 4:36 PM

కేసీఆర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి...


తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత రాజకీయాలలో మునుపెన్నడూ లేనంత వేడి కనిపిస్తుంది. దుబ్బాక నుంచే కేసీఆర్ పతనం మొదలైందంటున్న ప్రతిపక్ష నాయకులు.. అధికార పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొద్దిరోజుల్లో జీహెచ్ఎంసీ కి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు అధికార పార్టీపై ఆరోపణలను తీవ్రతరం చేస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ కంటే బీజేపీ కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు, సీనియర్ నటి విజయశాంతి కూడా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఆమె బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఫేస్బుక్ వేదికగా విజయశాంతి ఒక పోస్టు పెట్టారు. అందులో సీఎం కేసీఆర్ ను ఉద్దేశిస్తూ.. ఆయన చేసే సర్వేలన్నీ పనికిరానివని చెప్పారు. అందులో అన్నీ అవకతవకలే ఉంటాయని ఆరోపించారు. ఆమె పోస్టులో ‘జీహెచ్ఎంసీలో గెలుపు మాదేనంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారివన్నీ అవకతవక సర్వేలు. దుబ్బాక ఎన్నికల ముందు కూడా ఇలాగే మాట్లాడారు. సానుభూతి తప్ప దుబ్బాక ఫలితం మరొకటి కాదంటున్న సీఎం గారు ఆ సానుభూతి టీఆర్ఎస్ కు ఎందుకు లభించలేదో కూడా చెప్పాలి’ అంటూ ఫైర్ అయ్యారు. అంతేగాక తాజా ఎన్నికల్లో ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గే కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలు జరపడానికి పూనుకున్నారని ఆమె ఆరోపించారు. ‘ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి జీహెచ్ఎంసీ ఎన్నికలు రోజుల్లోనే జరపటానికి నిర్ణయించినట్టు కనబడుతోంది...’ అని ఆమె విమర్శించారు. ఇదిలాఉండగా.. త్వరలోనే విజయశాంతి పలువురు కాంగ్రెస్ నేతలను వెంటబెట్టుకుని బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినబడుతున్నాయి. కొంతకాలంగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కూడా అందుకు ఊతమిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ బలపడిందని అనడం.. జేపీ నడ్డాను కలవడం, కిషన్ రెడ్డితో మంతనాలు ఇవన్నీ అందులో భాగమే.

Tags :
|

Advertisement