Advertisement

  • ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా నేత్ర దానం చేయాలన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా నేత్ర దానం చేయాలన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

By: chandrasekar Wed, 09 Sept 2020 09:44 AM

ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా నేత్ర దానం చేయాలన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు


దేశంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా నేత్ర దానం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. నేత్రదాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. అవయవదానంపై ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావలసిన అవసరం ఉందన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం కృషిచేస్తున్న సక్షం (సమదృష్టి, క్షమత, వికాస్, అనుసంధాన్ మండల్) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నేత్రదాన పక్షోత్సవాల ముగింపు సందర్భంగా అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. దృష్టిలోపాన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యగా పేర్కొన్న ఉపరాష్ట్రపతి భారతదేశంలో దాదాపుగా 46 లక్షల మంది కంటిచూపులేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

చాలామంది కంటి చూపు లేక బాధపడుతున్నారని దేశంలో అంధత్వానికి కంటిశుక్లాల సమస్య తర్వాత కార్నియా సమస్యలు రెండో అతిపెద్ద కారణమని దేశవ్యాప్తంగా ఏడాదికి దాదాపుగా 20 వేల కేసులు నమోదవుతున్నాయన్నారు. కార్నియా బాధితుల్లో ఎక్కువమంది యువకులు, చిన్నారులే ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, కంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే చికిత్స చేయించుకోవడం, లేదా కార్నియా శస్త్ర చికిత్సలు చేయించుకోవడం వంటి వాటిద్వారా భవిష్యత్తులో దృష్టిలోపం, అంధత్వం రాకుండా జాగ్రత్తపడవచ్చని సూచించారు. ఈ ప్రక్రియలో సమయం ఆవశ్యకతను వివరించిన ఉపరాష్ట్రపతి దాత శరీరం నుంచి కంటితోపాటు ఇతర అవయవాలను సేకరించిన తర్వాత వాటిని భద్రపరిచేందుకు సరైన వసతులను ఏర్పాటుచేసుకోవడం కూడా కీలకమన్నారు.

అవయవాలను దాతలనుంచి సేకరించిన తరువాత జిల్లా కేంద్రాలు, ద్వితీయశ్రేణి పట్టణాల్లో అక్కడే అవసరమున్న గ్రహీతలకు శస్త్రచికిత్సల ద్వారా మార్పిడి చేయడానికి కావాల్సిన నిపుణులు, మౌలిక వసతులపైనా దృష్టిపెట్టాల్సిన అవసరముందన్నారు. కంటితోపాటు కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, హృదయం మొదలైన అవయవాల దానంపై చైతన్య కార్యక్రమాలు చేపట్టడంలో యువత చొరవతీసుకోవాలని సూచించారు. దివ్యాంగుల సమస్యలను అర్థం చేసుకుని ఆయా ప్రాంతాల్లో వారికి సహాయం చేసేందుకు సక్షమ్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. అంతర్జాల వేదిక ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొన్నారు.


Tags :
|

Advertisement