Advertisement

  • టిక్‌టాక్ నిషేధంపై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

టిక్‌టాక్ నిషేధంపై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

By: chandrasekar Sat, 08 Aug 2020 7:29 PM

టిక్‌టాక్ నిషేధంపై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్


భద్రతా కారణాలవల్ల చైనా యాప్స్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన పని చేశారు. టిక్ టాక్, విఛాట్ యాప్స్‌పై లావాదేవీలు నిషేధించి చైనాకు షాకిచ్చారు. ఈ మేరకు వేరువేరుగా కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆగస్టు 6న అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. 45 రోజుల తర్వాత నిషేధం అమలులోకి రానుంది. చైనా యాప్స్ వల్ల దేశ భద్రతకే ముప్పు పొంచి ఉంటుందని, అందువల్లే కఠిన నిర్ణయం తీసుకున్నానని ట్రంప్ ప్రకటించారు. అమెరికా మరియు చైనా ల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ లో భాగంగా టిక్‌టాక్ పై నిషేధం విధించారు.

చైనాలో వున్న టిక్ టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్ కచ్చితంగా అమెరికాలోని ఏదైనా కంపెనీకి తమ కంపెనీని విక్రయించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో అమెరికాలో టిక్ టాక్ నిషేధిస్తారు. కొన్ని రోజుల కిందట దీనిపై ట్రంప్ ప్రకటన చేయగా తాజాగా ఉత్తర్వులపై సంతకాలు చేసి మరో అడుగు ముందుకేశారు. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ కూడా టిక్‌టాక్ ను కొనడానికి ప్రయత్నిస్తున్నది. చైనా యాప్స్ వల్ల అమెరికా భద్రతకు, పౌరుల రక్షణకు ముప్పు పొంచి ఉంటుందన్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకున్నానని ఓ ప్రకటనలో ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికాలో మాత్రమే కాకుండా భారత్‌లోనూ చైనా యాప్‌లను నిషేధించించారని ట్రంప్ ప్రస్తావించారు. భద్రతా కారణాల దృష్ట్యా టిక్ టాక్ సహా మరెన్నో యాప్‌లపై భారత్ నిషేధం విధించడంతో పాటు తమ పౌరుల సమాచారాన్ని చోరీ చేసి దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆరోపించిందని గుర్తుచేశారు. టిక్‌టాక్‌ను నిషేధించిన తొలి దేశం భారత్ అని, అక్కడ మొత్తం 106 వరకు చైనా యాప్‌లను నిషేధించారని, భద్రత, నిఘా అంశాలకు భంగం వాటిల్లకుండా అమెరికా సైతం ఇలాంటి నిర్ణయాలను అమలు చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ తరువాత అధికంగా టిక్‌టాక్ ను వాడే దేశాలలో అమెరికా రెండో స్థానంలో వుంది.

Tags :
|

Advertisement