Advertisement

  • కరోనా పరీక్షలను బహిష్కరిస్తూ రెండు గ్రామ పంచాయతీల ఏకగ్రీవ తీర్మానం

కరోనా పరీక్షలను బహిష్కరిస్తూ రెండు గ్రామ పంచాయతీల ఏకగ్రీవ తీర్మానం

By: chandrasekar Fri, 09 Oct 2020 12:12 PM

కరోనా పరీక్షలను బహిష్కరిస్తూ రెండు గ్రామ పంచాయతీల ఏకగ్రీవ తీర్మానం


కరోనా పరీక్షలను బహిష్కరిస్తూ హర్యానా రాష్ట్రం ఫతేహాబాద్ జిల్లా పరిధిలోని తమస్పురా, అలీపూర్ భరోత పంచాయతీలు ఈ నెల 6న ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. గ్రామాల్లోని ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వ ఆరోగ్య బృందాలను అనుమతించబోమని తెలిపాయి. ఈ మేరకు చేసిన ఏకగ్రీవ తీర్మానాలపై ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు బలరామ్‌ సింగ్‌, మైనా దేవి సంతకం చేశారు.

తమ గ్రామ ప్రజలు ఆరోగ్యంగానే ఉన్నారని, కరోనా లక్షణాలున్న ఆరోగ్య సిబ్బంది గ్రామంలోకి ప్రవేశిస్తే వైరస్‌ తమకు సోకుతుందని వారు భయపడుతున్నారని, అందుకే ఈ తీర్మానం చేసినట్లు సర్పంచ్‌ బలరామ్‌ సింగ్‌ తెలిపారు. ఒకవేళ ఎవరికైనా కరోనా సోకినట్లు నిర్ధారణ అయితే వారిని క్వారంటైన్‌ కేంద్రానికి తీసుకెళ్లిన పక్షంలో గ్రామస్తులు ఆందోళన చెందుతారని ఆయన తెలిపారు. అయితే క్వారంటైన్‌ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేవని, కరోనా నియంత్రణకు ఔషధాలు లేవన్న అపోహల నేపథ్యంలో ఆయా గ్రామ ప్రజలు కరోనా పరీక్షలకు ముందుకు రావడం లేదని, దీంతో ఆయా పంచాయతీలు ఈ మేరకు తీర్మానాలు చేసినట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.

ఈ తీర్మానాలపై ఫతేహాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ నరహరి సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు గ్రామాల సర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసమే ప్రజలకు కరోనా పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తున్నదని ఆయన చెప్పారు. కాగా, ఇదే జిల్లాకు చెందిన నక్తా గ్రామంలో గత నెలలో కరోనా పరీక్షల నిర్వహణకు వచ్చిన వైద్య సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకున్నారు. కరోనా టెస్టింగ్‌ కిట్లను ధ్వంసం చేసి తగులబెట్టారు. దీంతో ఆ గ్రామస్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Tags :

Advertisement