Advertisement

కాల్పుల్లో ఇద్ద‌రు మావోయిస్టులు మృతి...

By: chandrasekar Mon, 21 Sept 2020 1:00 PM

కాల్పుల్లో ఇద్ద‌రు మావోయిస్టులు మృతి...


ప‌దిహేను రోజులుగా కూంబింగ్ నిర్వ‌హిస్తున్న ప్ర‌త్యేక‌ పోలీసు సిబ్బందికి శ‌నివారం రాత్రి కాగ‌జ్‌న‌గ‌ర్ మండ‌లం ఈస్‌గాం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని క‌దంబ అడ‌వుల్లో మావోయిస్టులు తార‌స‌ప‌డ్డారు. ఇరువ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన కాల్పుల్లో ఇద్ద‌రు మావోయిస్టులు మృతిచెందిన సంగ‌తి తెలిసిందే. మ‌రో న‌లుగురు త‌ప్పించుకున్న‌ట్లుగా స‌మాచారం. కాగా మృతిచెందిన మావోయిస్టుల మృదేహాల‌ను పోలీసులు ఆదివారం గుర్తించారు. సంఘ‌ట‌నా స్థ‌లం నుంచి రెండు ఆయుధాల‌ను, రెడ్ బ్రిగేడ్‌కు చెందిన సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రామగుండం పోలీసు కమిషనర్, ఇన్‌చార్జ్ పోలీస్ సూపరింటెండెంట్ వి సత్యనారాయణ వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ.. మృతుల‌ను చుక్కలు, బదిరావుగా గుర్తించిన‌ట్లు తెలిపారు. వీరు మైలరాపు భాస్కర్ అలియాస్ అడెలు నేతృత్వంలోని కుమ్రామ్ భీమ్-మాంచెరియల్ స్క్వాడ్ సభ్యులన్నారు. యాక్షన్ టీమ్‌లో కీలక సభ్యుడైన చుక్కలు ఛత్తీస్‌గ‌ఢ్‌కు చెందినవాడన్నారు. మందమర్రి నివాసితుడైన బదిరావు మూడు నెలల క్రితమే జట్టులో చేరిన‌ట్లు తెలిపారు.

లొంగిపోవాల్సిందిగా హెచ్చ‌రిక‌లు చేసిన‌ప్ప‌టికీ వినిపించుకోకుండా కాల్పుల‌కు దిగ‌డ‌టంతో పోలీసులు ఎదురు కాల్పులు జ‌ర‌పాల్సి వ‌చ్చింద‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు. గంట‌పాటు కొన‌సాగిన ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు మావోయిస్టులు మృతిచెందార‌న్నారు. సంఘ‌ట‌నా స్థ‌లం నుంచి త‌ప్పించుకు పారిపోయిన న‌లుగురు మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ట్లు చెప్పారు. ఎనిమిది గ్రేహండ్ పార్టీలు, ఆరు స్పెష‌ల్ పోలీసు పార్టీలు అట‌వీప్రాంతంలో కూంబింగ్‌ను ముమ్మ‌రం చేసిన‌ట్లు తెలిపారు. భాస్కర్ అలియాస్ అడెలు నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం గత ఐదు రోజుల్లో మూడుసార్లు పోలీసు బలగాల చేతిలో పడకుండా తప్పించుకుంది. సెప్టెంబర్ 18న ఆసిఫాబాద్ మండలంలోని చిలాటిగుడ గ్రామంలో పోలీసులకు స‌న్నిహితంగా తార‌స‌ప‌డటం జ‌రిగింద‌న్నారు.

Tags :
|
|

Advertisement