Advertisement

  • పాక్‌లో ఇద్దరు భారత దౌత్య సిబ్బంది అధికారులు అదృశ్యం

పాక్‌లో ఇద్దరు భారత దౌత్య సిబ్బంది అధికారులు అదృశ్యం

By: chandrasekar Tue, 16 June 2020 4:27 PM

పాక్‌లో ఇద్దరు భారత దౌత్య సిబ్బంది అధికారులు అదృశ్యం


ఇస్లామాబాద్‌లోని తమ దౌత్య ఉద్యోగుల భద్రతకు ముప్పు పొంచి ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేసిన రెండు రోజుల్లోనే ఇద్దరు అధికారులు అదృశ్యమయ్యారు. సోమవారం ఉదయం నుంచి ఈ ఇద్దరూ కనిపించకుండా పోయినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దౌత్య సిబ్బంది అదృశ్యంపై విదేశాంగ శాఖ సమాచారంతో భారత అధికారులు అప్రమత్తమయ్యారు. పాక్ అధికార యంత్రాగానికి సమాచారం అందజేశారు. సోమవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయిన వారి వివరాలను వెల్లడించలేదు.

గూఢచర్యానికి పాల్పడిన ఇద్దరు పాక్ దౌత్య ఉద్యోగులను భారత్ బహిష్కరించడంతో దాయాది మరింత ఆక్రోశంతో రగిలిపోతోంది. దీనికి ప్రతీకారంగా పాక్‌లోని భారత్ రాయబార కార్యాలయం అధికారులను వేధింపులకు గురిచేస్తూ విధులకు ఆటంకం కలిగిస్తోంది. భారత రాయబార కార్యాలయం అధికారి గౌరవ్ అహ్లువాలియాపై త గురువారం పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ బెదిరింపులకు పాల్పడింది. గూఢచర్యానికి పాల్పడిన పాక్ దౌత్య సిబ్బందిని మే 31న భారత్ బహిష్కరించిన తర్వాత అక్కడ ఇండియన్ హైకమిషన్ ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తోంది.

ఈ విషయం లో పాక్ చర్యలను వ్యతిరేకిస్తూ శుక్రవారం మరోసారి భారత్ నిరసన తెలియజేసింది. పాక్ చర్యలు ఇరు దేశాల మధ్య కుదిరిన 1961 నాటి వియన్నా ఒప్పందం, దౌత్య సంబంధాలు, 1992 నాటి ద్వైపాక్షిక ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని మండిపడింది. వియన్నా ఒప్పందానికి కట్టుబడి ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్, సిబ్బందికి భద్రత కల్పించి, సాధారణ కార్యకలాపాల నిర్వహణకు సహకరించాలని కోరింది.

Tags :

Advertisement