Advertisement

భక్తుల్లేకుండానే శ్రీవారి బ్రహ్మెత్సవాలు

By: Dimple Fri, 28 Aug 2020 3:03 PM

భక్తుల్లేకుండానే శ్రీవారి బ్రహ్మెత్సవాలు

భక్తజనరంజకంగా సాగే బ్రహ్మోత్సవాలు... భక్తజనులతో సంబంధంలేకుండా... నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. సెప్టెంబరు 19 నుంచి 28 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తామని తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో తితిదే పాలకమండలి సమావేశం ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...కరోనా కారణంగా స్వామివారి వాహన సేవలు మాడవీధుల్లో నిర్వహించే పరిస్థితి లేదన్నారు.

బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహిస్తామని వెల్లడించారు. అధికమాసం కారణంగా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయని వివరించారు. అక్టోబర్‌లో ఉత్సవాల సమయానికి కరోనా ప్రభావం తగ్గితే యథాతథంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. బర్డ్‌ ఆసుపత్రిలో నూతన గదుల నిర్మాణానికి రూ.5.5కోట్లు, విశాఖలోని ఆలయానికి రహదారి కోసం రూ.4.5 కోట్లు మంజూరు చేసినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. తితిదే ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు.

కరోనా బారిన పడిన తితిదే ఉద్యోగుల వైద్య ఖర్చులు తితిదే భరించాలని పాలకమండలి నిర్ణయించిందన్నారు. తిరుమలలో వ్యర్థ పదార్థాల నిర్వహణకు ఆధునిక పద్ధతుల కోసం తితిదే బోర్డు సభ్యురాలు సుధానారాయణమూర్తి రూ.కోటి విరాళం ఇచ్చారని వెల్లడించారు. గో సంరక్షణకు అధికప్రాధాన్యత ఇవ్వాలని తితిదే నిర్ణయించిందని, ప్రతి ఆలయానికి ఒక ఆవు ఇవ్వాలని సమావేశంలో చర్చించినట్టు ఛైర్మన్‌ చెప్పారు. ఆవు ఇచ్చే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. బ్యాంకుల్లో స్వామి వారి విరాళాల డిపాజిట్‌ విధానాలు మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Tags :

Advertisement