Advertisement

  • ఓటమిని ఒప్పుకునేందుకు ససేమిరా అంటున్న ట్రంప్...

ఓటమిని ఒప్పుకునేందుకు ససేమిరా అంటున్న ట్రంప్...

By: chandrasekar Tue, 10 Nov 2020 4:54 PM

ఓటమిని ఒప్పుకునేందుకు ససేమిరా అంటున్న ట్రంప్...


జో బైడెన్..అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేత అని తేలిపోయినా- అధికార పీఠాన్ని వదిలేందుకు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తిరస్కరించారు. దీంతో అధికార మార్పిడి ప్రక్రియపై ప్రతిష్ఠంభన నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఓట్లలెక్కింపు ఓ కొలిక్కి వచ్చాక- అమెరికా సాధారణ సేవల పాలనా విభాగం ప్రకటనతో అధికార మార్పిడి ప్రక్రియ మొదలవుతుంది. అయితే బైడెన్‌ గెలిచి 48 గంటలు గడుస్తున్నా - జీఎ్‌సఏ చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఎమిలీ మర్ఫీ మాత్రం స్పందించడం లేదు. ఎమిలీ డొనాల్డ్‌ ట్రంప్‌ నియమించిన అధికారిణి. అధికార మార్పిడికి సంబంధించి- ఆమే బైడెన్‌ బృందానికి 9.9 మిలియన్‌ డాలర్ల నిధుల్ని విడుదల చేయాలి. వివిధ ప్రభుత్వ విభాగాలను ఈ బృందానికి అందుబాటులోకి తెస్తుంది. తద్వారా అధికార యంత్రాంగం ఇకమీదట బైడెన్‌ బృంద సూచనలకు అనుగుణంగా వెళ్లాల్సి వస్తోంది.

కానీ, జీఎ్‌సఏ- బైడెన్‌ బృందానికి ఆఫీసును, అవసరమైన ఇతర లాజిస్టిక్స్‌ను సమకూర్చినా- వీరి జీతాలకు, రవాణా ఖర్చులకు అవసరమైన 9.9 మిలియన్‌ డాలర్ల మొత్తాన్ని విడుదల చేయలేదు. నిధులు, అధికార యంత్రాంగ అప్పగింతకు వీలుకల్పించే పత్రాలపై ఎమిలీ సోమవారం దాకా సంతకం చేయలేదు. దీంతో ఆమె తీరుపై విమర్శలు చేలరేగాయి. జీఎ్‌సఏ అధికారులెవరూ బైడెన్‌ బృందంతో అసలు మాట్లాడరాదన్న ఆదేశాలు వచ్చాయని ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. జీఎ్‌సఏ తీరును చూశాక- బైడెన్‌ తనంత తానుగానే చర్యలు మొదలుపెట్టేశారు. ఎన్నికల హామీకి అనుగుణంగా కరోనా‌ కట్టడిపై ఓ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశారు. 13 మంది శాస్త్రవేత్తలు, నిపుణులు, డాక్టర్లతో కూడిన ఈ టాస్క్‌ఫోర్స్‌కు సుప్రసిద్ధ భారతీయ అమెరికన్‌ వైద్యుడు వివేక్‌ మూర్తి నేతృత్వం వహిస్తున్నారు.

రక్షణమంత్రి డిస్మిస్...

రక్షణమంత్రి మైక్‌ ఎస్పర్‌ను డిస్మిస్‌ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. ఈ విషయాన్ని ట్రంపే ట్విటర్‌ ద్వారా తెలిపారు. జాతీయ ఉగ్రవాద-నిరోధక కేంద్ర డైరెక్టర్‌గా ఉన్న క్రిస్టోఫర్‌ మిల్లర్‌ను తాత్కాలిక రక్షణమంత్రిగా నియమించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన 48 గంటల తరువాత ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

sasemira,tells,trump,to admit,defeat ,ఓటమిని, ఒప్పుకునేందుకు, ససేమిరా ,అంటున్న ,ట్రంప్


మెలానియా సూచన...

ట్రంప్‌ ఓడినా అధికారాన్ని వదలను అంటూ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన భార్య మెలానియా చేసిన ఆసక్తికర వ్యాఖ్యలను ఒక ప్రముఖ చానెల్‌ వెల్లడించింది. ‘ఎన్నికల్లో పరాజయం స్వీకరిస్తున్నాను. ఆయన(ట్రంప్‌) ఓటమిని అంగీకరిస్తే బావుండు’ అని మెలానియా అన్నారట. కాకపోతే.. బహిరంగంగా కాదు. వారి సన్నిహితుల వద్ద ఆ అభిప్రాయాన్ని వెలిబుచ్చారని సదరు చానెల్‌ పేర్కొంది. ట్రంప్‌ అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌ కూడా ఓటమిని హుందాగా ఒప్పుకోవాలని కోరినట్లు సీఎన్‌ఎన్‌ పేర్కొంది. ట్రంప్‌ కుమారులు డొనాల్డ్‌ జూనియర్‌, ఎరిక్‌ మాత్రం కోర్టుల్లో పోరాడదామని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. రిపబ్లికన్‌ సెనెటర్లు, కొన్ని రాష్ట్రాల గవర్నర్లు కూడా కోర్టు పోరాటమే కావాలంటున్నారు.

చైనా, రష్యా

జో బైడెన్‌ను ప్రపంచ దేశాలు అభినందనలతో ముంచెత్తుతుండగా.. చైనా, రష్యా మాత్రం దూరంగా ఉంది. ‘‘అమెరికా ఎన్నికల ఫలితాలను ఆ దేశ చట్టాలు, విధానాలు నిర్ణయిస్తాయి. ఇంకా ఎన్నికల ఫలితాలపై తుది నిర్ణయం వెల్లడవ్వలేదు’’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ తెలిపారు. చైనా-అమెరికా సంబంధాలు ట్రంప్‌ హయాంలో దిగజారిపోయాయని, తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నామని పేర్కొన్నారు. రష్యా, మెక్సికో దేశాలు కూడా బైడెన్‌ విజయాన్ని ఇంకా అధికారికంగా గుర్తించలేదు. అధికారిక ప్రకటన రావాల్సి ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. ట్రంప్‌ విజయం సమయంలో హిల్లరీ క్లింటన్‌ కేసుల నేపథ్యంలో అధికారిక ఫలితం రాకుండానే పుతిన్‌ ఆయనకు అభినందనలు తెలపడం గమనార్హం.

Tags :
|
|

Advertisement