Advertisement

గణపతిపై టీఆర్ఎస్ కండువా... విమర్శల వెల్లువలు

By: chandrasekar Fri, 20 Nov 2020 3:26 PM

గణపతిపై టీఆర్ఎస్ కండువా... విమర్శల వెల్లువలు


టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పూజలు చేస్తున్న సమయంలో దేవాలయంలోని గులాబీ పార్టీ కండువాను గణపతిపై ఉంచి పూజలు చేశారు. హైదరాబాద్ గాంధీనగర్ ప్రాంతంలో లక్ష్మీగణపతి ఆలయాన్ని ఎమ్మెల్సీ కవిత గురువారం సందర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక పార్టీ నేతలతో కలిసి కవిత ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గులాబీ కండువాను గణపతి ఉంచి ఉంచి పూజలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఆలయంలో పూజల అనంతరం కార్పొరేటర్ అభ్యర్థి ముత్తా పద్మ నరేశ్, టీఆర్ఎస్ నేత ముత్తా జైసింహా అబిడ్స్ సర్కిల్ కార్యాలయానికి చేరుకుని జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. దేవుడిపై కండువా ఉంచి పూజలు చేసి, ఆ కండువాను వేసుకుని నామినేషన్ వేస్తే మంచి జరుగుతుందని అలా చేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

గణపతి దేవుడిపై టీఆర్ఎస్ పార్టీ కండువా వేయడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా మండిపడ్డారు. టీఆర్ఎస్ అహంకారానికి ఇది నిదర్శనమని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీతోనే బీజేపీకి పోటీ అని, టీఆర్ఎస్ కాదని అరవింద్ అన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం పరిహారం ఇస్తుంటే బీజేపీ ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు. మజ్లిస్‌తో దోస్తీ చేస్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ముస్లింలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై యుద్ధం ప్రకటించాలంటే ముందుగా ఫాం హౌస్ నుంచి కేసీఆర్ బయటకు రావాలని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో టీఆర్ఎస్ కనుసన్నల్లోనే నడుస్తోందని, ఈ విషయంపై కొంతమంది అధికారులపై ఫిర్యాదు చేయబోతున్నామని అరవింద్ చెప్పారు. జీహెచ్ఎంసీ కమిషనర్లను బదిలీ చేయమని లేఖ రాస్తామని తెలిపారు. ఎన్నికల్లో బీజేపీని అణచివేయాలని పోలీసులతో ప్రయత్నిస్తే ఊరుకోబోమని అరవింద్ హెచ్చరించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు.

Tags :
|
|
|

Advertisement