Advertisement

  • కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ పొట్టకూటి కోసం భవన నిర్మాణ కూలీగా...

కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ పొట్టకూటి కోసం భవన నిర్మాణ కూలీగా...

By: chandrasekar Wed, 16 Sept 2020 07:50 AM

కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ పొట్టకూటి కోసం భవన నిర్మాణ కూలీగా...


కరోనా రావడంతో చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయి వీధిన పడ్డారు. ఇందులో భాగంగా ఒక ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని కోల్పోయి పొట్టకూటి కోసం భవన నిర్మాణ కూలీగా మారాడు. కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్ వల్ల ఎందరో ఉపాధి కోల్పోయారు. ఎన్నో సంస్థలు మూతపడగా, భారీ సంఖ్యలో ఉద్యోగులు రోడ్డునపడ్డారు. ముఖ్యంగా ప్రైవేటు విద్యాసంస్థల్లోని ఫ్యాకల్టీ, పార్ట్‌టైం ఉపాధ్యాయుల పరిస్థితి మరింత దీనంగా మారింది. ఉపాధి లేక పొట్టకూటి కోసం పలువురు ఉపాధ్యాయులు కూలీలుగా మారుతున్నారు.

ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ట్రిపుల్ ఐటీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తున్న లక్ష్మణ్ నాయుడుకు జీతాలు ఇవ్వకపోవడంతో భవన నిర్మాణ కూలీగా మారారు. శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీలో లక్ష్మణ్ నాయుడు గత మూడేళ్లుగా గెస్ట్ ఫ్యాకల్టీగా చేస్తున్నారు. కరోనా వల్ల విద్యాసంస్థలు మూతపడ్డాయి. మే 28 వరకు ఉద్యోగంలో ఉంచిన యాజమాన్యం తర్వాత జీతాలు ఇవ్వలేమని చేతులెతేసింది. వేరే ఉద్యోగాలు దొరకక కుటుంబ పోషణ భారంగా మారి పూట గడవడానికి కూలీ పనులకు చాలామంది వెళుతున్నారు.

గత 4 నెలలుగా జీతాలు లేకపోవడంతో ఏమి చేయాలో పాలుపోక పూటగడవం కష్టంగా మారడంతో ఓ తాపీ మేస్త్రీ దగ్గర లక్ష్మణ్ నాయుడు కూలీగా పనిలో చేరారు. తన పరిస్థితిపై లక్ష్మణ్ నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో గత మూడేళ్ల నుంచి గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నట్లు చెప్పారు. మే 28న యాజమాన్యం ఇక, జీతాలు ఇవ్వలేం బయటకు వెళ్లిపోవాలని చెప్పారని వాపోయారు. దీంతో ఎలాంటి ఉపాధి మార్గం లేక తాపీ పనికి వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కూలీ పనికి రోజుకు రూ. 300 ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఎప్పుడైనా వర్షం పడితే ఈ పని కూడా ఉండటం లేదని వాపోయారు.

భవన కూలి పని లేక పోవడంతో వేరే గత్యంతరం లేక ఖాళీగా ఉండకుండా వేరుశనగ, జొన్న కంకులు విరవడానికి వెళ్తున్నానని తెలిపారు. చదువుకున్న వాళ్లమని కొందరు పనికి పిలవడం లేదని, దీంతో మేమే వారి వద్దకు వెళ్లి పని అడుక్కుని చేస్తున్నామని లక్ష్మణ్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 4 ట్రిపుల్ ఐటీలు ఉన్నాయని, వాటిలో 250 మంది గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నారని చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో తమ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయని, తమను ఆదుకోవాలని యాజమాన్యానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేతులు జోడించి వేడుకున్నారు. చాలా మంది జీవితాలు మరి దారుణంగా మారడంతో చేసేది లేక దొరికిన పని చేస్తున్నారు.

Tags :

Advertisement