Advertisement

  • వనపర్తి జిల్లాలో విషాదకర ఘటన....మిద్దె కూలి ఐదుగురి దుర్మరణం

వనపర్తి జిల్లాలో విషాదకర ఘటన....మిద్దె కూలి ఐదుగురి దుర్మరణం

By: chandrasekar Tue, 27 Oct 2020 5:26 PM

వనపర్తి జిల్లాలో విషాదకర ఘటన....మిద్దె కూలి ఐదుగురి దుర్మరణం


వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని బుద్దారంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత మట్టిమిద్దె కూలడంతో గాఢ నిద్రలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. ఎస్సై రామన్‌గౌడ్‌ కథనం ప్రకారం... బుద్దారం గ్రామానికి చెందిన చెవ్వ నరసింహ్మయ్య ఏడాది క్రితం మృతి చెందాడు. శనివారం ఆయన సంవత్సరికం కావడంతో నలుగురు కొడుకులు, కోడళ్లు, వారి పిల్లలు అందరూ ఇంటికి వచ్చారు. కార్యక్రమనంతరం రాత్రి భోజనాలు చేసి అందరూ ఒకే గదిలో పడుకున్నారు. ఇటీవల కురిసిన వానలకు పాత ఇల్లు కావడంతో తడిసి బాగా నానిపోయి ఉంది. వారంతా గాఢనిద్రలో ఉండగా అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో ఇంటి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో గదిలో నిద్రిస్తున్న ఇంటి యజమాని మణెమ్మ(68), ఆమె కోడళ్లు సుప్రజ (40), ఉమాదేవి (38), మనుమరాళ్లు వైష్ణవి(14), అక్షయ(12) అక్కడికక్కడే మృతి చెందారు. మణెమ్మ కుమారుడు కుమారస్వామి, ఇతరులకు తీవ్రగాయాలైనాయి.

చికిత్స నిమిత్తం వారిని మహబూబ్‌నగర్‌ ఎస్వీఎస్‌ హాస్పిటల్ కు, అక్కడి నుంచి సన్‌షైన్‌ హాస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. గ్రామస్థులు దసరా పండుగకు సిద్ధమవుతున్న వేళ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలాన్ని వనపర్తి జిల్లా ఇంచార్జి, నాగర్‌కర్నూల్‌ ఎస్పీ సాయిశేఖర్‌, వనపర్తి ఏఎస్పీ షాకీర్‌ హుస్సేన్‌ పరిశీలించారు. ఈ ఘటనతో గ్రామస్థులు దసరా పండుగను రద్దు చేసుకున్నారు. సంఘటనపై వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తామన్నారు.

Tags :
|

Advertisement