Advertisement

  • తమిళనాడులో విషాద ఘటన...టపాసుల కర్మాగారంలో పేలుడు

తమిళనాడులో విషాద ఘటన...టపాసుల కర్మాగారంలో పేలుడు

By: chandrasekar Sat, 24 Oct 2020 2:04 PM

తమిళనాడులో విషాద ఘటన...టపాసుల కర్మాగారంలో పేలుడు


తమిళనాడులోని మధురై సమీపంలోని టి.కల్లుపట్టి ప్రాంతంలో టపాసుల కర్మాగారంలో పేలుడు జరిగిన ఘటనలో ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మధురై సమీపంలోని టి.కల్లుపట్టి ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీని రాజ్యలక్ష్మి ఫైర్ క్రాకర్స్ కంపెనీగా గుర్తించారు. దీపావళి పండగ సమీపిస్తున్న వేళ ఇక్కడ వివిధ రకాల బాణాసంచా పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 50 మంది కార్మికులు వివిధ పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీ యజమానిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.

ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం జరగటం వల్ల ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టపాసుల తయారీకి ఉపయోగించే రసాయనాలకు మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా భారీ శబ్దాలు చేస్తూ వరుస పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి వచ్చారు. నాలుగు అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలను అదుపులోకి వచ్చారు. గాయపడ్డ వారిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా మరో ముగ్గురు 70 శాతానికి పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు.

Tags :

Advertisement