Advertisement

వరంగల్‌రూరల్‌ జిల్లాలో విషాదం...

By: chandrasekar Wed, 28 Oct 2020 8:24 PM

వరంగల్‌రూరల్‌ జిల్లాలో విషాదం...


వరంగల్‌రూరల్‌ జిల్లాలో మంగళవారం 16 మందితో ప్రయాణిస్తున్న జీపు బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. నలుగురు గల్లంతయ్యారు. బావి నిండా నీరు ఉండి, చీకటి పడడంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ నుంచి నెక్కొండకు 15 మందితో వెళ్తున్న జీపు సంగెం మండలం గవిచర్ల శివారుకు రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకుపోయింది. జీపు డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించి, సహాయక చర్యలు చేపట్టారు. జీపులో ఉన్నవారిలో 11 మంది స్వల్ప గాయాలతో బావి నుంచి బయటకు వచ్చారు. ఘటనా స్థలానికి మామునూరు ఏసీపీ శ్యాంసుందర్‌, పర్వతగిరి సీఐ కిషన్‌, సంగెం ఎస్సై సురేశ్‌.. తమ సిబ్బందితో చేరుకుని ఎక్స్‌కవేటర్‌ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

జీపుతో సహా మునిగిపోయిన నలుగురిని వెలికి తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇటీవలి వర్షాలకు బావి నిండిపోవడంతో.. ఫైరింజన్‌తో నీళ్లు తోడారు. అయితే.. ఊట కారణంగా.. ఆ పనికి ఆటంకమేర్పడింది. బావి నిండా తుమ్మ చెట్లు ఉండటంతో జీపును వెలికితీయడం కష్టంగా మారింది. చివరకు రాత్రి 9.45 సమయంలో.. జీపును బయటకు వెలికి తీశారు. అందులో డ్రైవర్‌ దోని సతీశ్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మిగతా నలుగురు ప్రయాణికుల మృతదేహాలను వెలికి తీసేందుకు బావిలో గాలిస్తున్నారు. జీపులో ఉన్న నెక్కొండ మండలం మడిపల్లికి చెందిన రామచంద్రం అనే వ్యక్తి.. ప్రమాదం జరగగానే.. తనతోపాటు ఐదుగురు మహిళలను కాపాడారు. మిగతా వారికోసం గాలించినా బావి లోతుకు వెళ్లడం అసాధ్యంగా మారిందని ఆయన అన్నారు. సహాయక చర్యల్లో డీసీపీ వెంకటలక్ష్మి, ఐనవోలు ఎస్సై నరసింహరావు, గీసుగొండ ఎస్సై నాగరాజు, పర్వతగిరి ఎస్సై ప్రశాంత్‌బాబు పాల్గొన్నారు.

Tags :
|

Advertisement