Advertisement

అమాంతంగా పెరిగిన టమేటా ధరలు

By: Dimple Tue, 25 Aug 2020 09:47 AM

అమాంతంగా పెరిగిన టమేటా ధరలు

నిన్న మొన్నటిదాకా పదిరూపాయలున్న టమేటా ధరలు ఒక్కసారిగా యాభైరూపాయలు చేరుకుంది. హైదరాబాద్‌ మార్కెట్లో టమేటా ధరలు అమాంతంగా పెరిగాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దిగుబడు తగ్గుముఖం పట్టడం... కాయల్లో నాణ్యత తగ్గిపోవడం.. డిమాండ్‌కు తగిన స్థాయిలో సరుకు అందుబాటులో లేకపోవడంతో ధరలు పెరిగిపోయాయి. హైదరాబాద్‌ బోయినపల్లి, భరత్‌ నగర్‌ మార్కెట్లో హోల్‌ సేల్‌ కిలో టమేటా ధర నలభై రూపాయలు కాగా... చిల్లర ధరల యాభైనుంచి అరవై రూపాయలు అమ్ముడవుతోంది. మదనపల్లి, అనంతపురం ప్రాంతాలనుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలకు టమేటాలు ఎగుమతి అవుతుంటాయి.

మదనపల్లె హోల్‌సేల్‌ మార్కెట్‌లోనూ టమాటా ధరలు మోత మోగిస్తున్నాయి. వారం క్రితం వరకు గ్రేడ్‌–1 టమాటా కిలో అత్యధికంగా రూ.20 ధర పలకగా.. ఇప్పుడు అమాంతం రూ.50కి పెరిగింది.

మదనపల్లె మార్కెట్‌లో ధరలిలా..
మదనపల్లె టమాటా హోల్‌సేల్‌ మార్కెట్‌లో సోమవారం గ్రేడ్‌–1 టమాటాను నాణ్యతను బట్టి రైతు నుంచి కిలో రూ.32 నుంచి రూ.50 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు.
గ్రేడ్‌–2 రకం నాణ్యతను బట్టి కిలో రూ.20 నుంచి రూ.30 వరకు అమ్ముడుపోయింది.
ఆగస్టు ప్రారంభంలో గ్రేడ్‌–1 రకం రూ.19 నుంచి రూ.32, గ్రేడ్‌–2 రకం రూ.10 నుంచి రూ.19.60 మధ్య పలికింది.
ఈ నెల 18 వరకు ఇవే ధరలు కొనసాగగా.. మరుసటి రోజు నుంచి అనూహ్యంగా పెరుగుతూ వచ్చాయి.

తగ్గిన దిగుబడి
తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా టమాటా పంట బాగా దెబ్బతింది. కొద్దోగొప్ప వస్తున్న పంట నాణ్యత ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. కాయపై మచ్చలు, పగుళ్లు రావడం, పంటను పురుగులు ఆశించడం, కాయలు కోసేందుకు వీలు లేకుండా పొలాల్లో నీళ్లు నిలిచిపోవడం, ఎక్కువ తేమకు చెట్టుకు తెగుళ్లు రావడంతో దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయి.

దీనికితోడు వరదల కారణంగా రవాణా ఖర్చులు పెరిగిపోయాయి. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశాలో టమాటా పంట దెబ్బతింది.
దాంతో ఆయా రాష్ట్రాల వ్యాపారులు టమాటా కొనుగోలు కోసం మదనపల్లె మార్కెట్‌కు వస్తున్నారు. నాణ్యమైన సరుకు లభిస్తుండటంతో ధర ఎంతైనా వెచ్చించేందుకు వ్యాపారులు వెనుకాడటం లేదు. మదనపల్లె మార్కెట్‌లో సాహో రకానికి చెందిన పంట అధికంగా వస్తుండటం, రంగు, రుచి, నాణ్యత బాగా ఉండటంతో మంచి ధర పలుకుతోంది.

Tags :
|
|
|

Advertisement