Advertisement

నేడు ఆ పార్టీ అబద్ధాలతో రాద్ధాంతం చేస్తోంది...

By: chandrasekar Tue, 17 Nov 2020 11:24 AM

నేడు ఆ పార్టీ అబద్ధాలతో రాద్ధాంతం చేస్తోంది...


మంత్రి హరీశ్‌రావు..జీహెచ్ఎంసీ‌ ఎన్నికల నేపథ్యంలో సోమవారం పఠాన్ చెరులో నిర్వహించిన బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీజేపీకి ఒకప్పుడు‌ సిద్దాంతం ఉండేదని, నేడు ఆ పార్టీ అబద్ధాలతో రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. గోబెల్స్ ప్రచారంతో అబద్ధాల పునాదులపై బీజేపీ రాజకీయంగా ఎదగాలని అనుకుంటుందని ఆక్షేపించారు. 70‌ ఏండ్ల పాలనలో కాంగ్రెస్, బీజేపీలు పఠాన్ చెరు కు కనీసం తాగునీళ్లు‌ కూడా తీసుకురాలేక పోయాయని గుర్తుచేశారు. ఎన్నిక హామీ మేరకు రూ. 251 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి‌ తాగునీరు సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలో వచ్చాక రాష్ట్రంలో ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లకు పనిలేకుండా పోయిందని అన్నారు. తెలంగాణ ఇస్తే‌ రాష్ట్రం చీకటిగా మారుతుందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కాంగ్రెస్ నేతల జీవితాల్లో చీకటి నిండి, ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో‌ పవర్‌హాలిడేస్‌ ప్రకటించడంతో పఠాన్ చెరులో‌ పరిశ్రమలు మూతపడ్డాయని గుర్తుచేశారు.

పఠాన్ చెరులో‌ ఇండస్ట్రియల్ పార్కు,‌ సుల్తాన్ పూర్‌లో మెడికల్‌ డివైస్‌ పార్కు, ఉస్మాన్ నగర్‌లో 250 ఎకరాల్లో ఐటీ‌పార్కు,‌ శివానగర్‌లో ఎల్ఈడీ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పఠాన్ చెరులో‌ స్టేడియం, ప్రతి డివిజన్‌లో ఫంక్షన్ హాలు,‌ రూ.2 కోట్లతో పాఠశాల ‌భవనం, చిన్నవాగు, పెద్దవాగులపై‌ 16 వంతెనలు నిర్మించామని పేర్కొన్నారు. జీఓ 58, 59‌ కింద పేదలకు ఉచితంగా పట్టాలిచ్చామని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆస్తి పన్నును 50శాతం తగ్గించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్లాలని మంత్రి హరీశ్‌రావు కార్యకర్తలకు సూచించారు. సోషల్ మీడియాలోనూ కాంగ్రెస్, బీజేపీల తీరును ఎండగట్టాలని కోరారు. సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీలు భూపాల్ రెడ్డి, ఫారూఖ్ హూస్సెన్, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ‌అటవీ అభివృద్ధి ‌సంస్థ ఛైర్మన్ ఒంటేరు‌ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :
|

Advertisement