Advertisement

  • ఉస్మానియా ఆస్పత్రిలో ఆక్సీజన్ అందక ముగ్గురి మరణం

ఉస్మానియా ఆస్పత్రిలో ఆక్సీజన్ అందక ముగ్గురి మరణం

By: chandrasekar Thu, 30 July 2020 10:52 AM

ఉస్మానియా ఆస్పత్రిలో ఆక్సీజన్ అందక ముగ్గురి మరణం


తెలంగాణలో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఆక్సీజన్ అందక మరో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వారు కరోనా రోగులు కావడం గమనార్హం. ఈ హృదయవిదారకమైన ఘటన గురించి ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఐదారు గంటల వ్యవధిలోనే ముగ్గురు కరోనా రోగులు ఆక్సీజన్ అందక ప్రాణాలు కోల్పోయినట్లు కథనం ప్రచురించింది. ఆ సమయంలో ఆక్సీజన్ సరఫరా చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.

సోమవారం ఐసోలేషన్ వార్డులో ఊపిరి అందక ఇబ్బందులు పడుతున్న ముగ్గురు పేషంట్ల గురించి ఆర్ఎంఓ, సూపరింటెండెంట్‌కు తెలిపినా ఫలితం లేదు. మెరుగైన స్థాయిలో ఆక్సీజన్ సరఫరాను మధ్యాహ్నం 3 గంటల తర్వాతే పునరుద్ధరించారు. కానీ, అప్పటికే ముగ్గురు కరోనా బాధితులు ప్రాణాలు విడిచారు. ఉస్మానియా ఆస్పత్రిలో 100 పడకలతో ఐసోలేషన్ వార్డు ఉంది. కరోనా బాధితులకు ఊపిరి అందడంలో ఇబ్బందులు ఎదురైతే ప్రతి పడకకు ఆక్సీజన్ పోర్టులు అందుబాటులో ఉన్నాయి.

చావు బతుకుల్లో ఉన్న ఓ పేషంట్ పరిస్థితి చూసి తాను మరో ఆక్సీజన్ పోర్టు నుంచి కనెక్షన్ చేసి ప్రాణవాయువు అందించినా ఫలితం లేదని ఓ వైద్యుడు విశ్వసనీయంగా వెల్లడించారు. దీంతో ఆ 30 ఏళ్ల కరోనా బాధితురాలు మరణించినట్లుగా చెప్పారు. సాధారణంగా ఆస్పత్రుల్లో ఆక్సీజన్ సరఫరాలో హెచ్చుతగ్గులు వస్తుంటాయని, కానీ, ప్రస్తుతం ఉన్న వ్యవస్థ నిలకడైన సరఫరా చేసేందుకు అనువుగా లేదని మరో ఉన్నత వైద్యాధికారి వెల్లడించినట్లు జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్న రోగులకు తగినంత స్థాయిలో ఆక్సీజన్ సరఫరా ఉండాలని ఆ ఉన్నతాధికారి తెలిపారు.

Tags :
|
|

Advertisement