Advertisement

  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఉచిత హామీలు నేరవేర్చాలంటే వేల కోట్ల నిధులు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఉచిత హామీలు నేరవేర్చాలంటే వేల కోట్ల నిధులు

By: chandrasekar Sat, 28 Nov 2020 2:55 PM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఉచిత హామీలు నేరవేర్చాలంటే వేల కోట్ల నిధులు


ఎన్నికల్లో ఏదో రకంగా గెలవాలని రాజకీయ పార్టీలు రకరకాలుగా ఉచిత హామీలను ప్రకటిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీలన్ని ప్రజలను ఆకర్షించడం కోసం వరాల జల్లులు కురిపిస్తున్నాయి. గ్రేటర్‌లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు ఉచిత హామీల బాటపట్టాయి. ఇదే విషయాన్ని తమ గ్రేటర్ ఎన్నిక మేనిఫెస్టోల్లో పొందుపురుస్తున్నాయి. అయితే పార్టీలు ఇస్తున్న కొన్ని ఉచిత హామీలను నేరవేర్చాలంటే వేల కోట్ల నిధులు కావాల్సి ఉంది. ప్రధాన పార్టీలు ఇచ్చిన హామీల తీర్చడానికి జీహెచ్‌ఎంసీకి కనీసం లక్ష కోట్ల రూపాయలైనా అవసరం పడుతుందనేది ఓ అంచనా. వాస్తవానికి జీహచ్‌ఎంసీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అలాగే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సేవరేజ్ బోర్డు కూడా ఫైనాన్షియల్ ట్రబుల్స్‌లో ఉంది. అయితే జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్ 5,600 కోట్ల రూపాయలు కాగా, ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో రూ.1,800 ఆదాయం లభిస్తుంది. అలాంటప్పుడు ఈ ఉచిత హామీలన్ని పార్టీలు ఎలా నేరవేరుస్తాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలోనే అమలుకు వీలుకాని హామీలు ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను ఆదేశించాలని పలువురు కోరుతున్నారు. ఇక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేస్తామని, ఉచితంగా మంచినీరు, పవర్ టారిఫ్, ప్రాపర్టీ టాక్స్ పేరిట టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు గ్రేటర్ వాసులకు పలు హామీ ఇచ్చాయి.

మునిసిపల్ ఎన్నికలు దగ్గర పడడంతో ఇప్పటికే పలువురు వరద బాధితులకు పదివేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసిన సంగతి తెలిసిందే. దాదాపు 6 లక్షల కుటుంబాలకు రూ. 650 కోట్లు కేటాయించినట్టుగా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే తాము అధికారంలోకి వస్తే వరద బాధితులకు 25వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని బీజేపీ, 50 వేల ఆర్థిక సాయం అందజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చాయి. ఈ మొత్తం దాదాపు 2 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. మరోవైపు నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని అందిస్తామని టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పేర్కొంటే కాంగ్రెస్‌ 30 వేల లీటర్ల వరకు ఉచితం అందజేస్తామని తెలిపింది. బీజేపీ మరో అడుగు ముందుకేసి నెల నెలా బిల్లులు చెల్లించే అవసరం లేకుండానే అందరికీ నల్లా నీళ్లు ఉచితంగా అందిస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ హామీలు తీర్చితే వాటర్ బోర్డు దాదాపు రూ.1000 కోట్ల ఆదాయం నష్టపోయే అవకాశం ఉంటుంది. గ్రేటర్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సెలూన్లకు, దోబీ ఘాట్లకు ఉచితంగా విద్యుత్ అని టీఆర్ఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, వంద యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునే కుటుంబాలకు ఉచిత కరెంట్‌ను అందిస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది.

అలాగే కాంగ్రెస్‌ కూడా అదే సదుపాయాలు కల్పిస్తానని తమ ప్రచారంలో ప్రకటించింది. నాయీబ్రహ్మణులు, రజకులు, విశ్వకర్మలకు చెందిన దుకాణాలకు ఆస్తిపన్నుతో పాటు విద్యుత్‌ బిల్లులు మాఫీ చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటికే డిస్కంలు భారీ అప్పుల్లో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఈ హామీ నేరవేర్చడం ఎంతవరకు సాధ్యమవుతుందనేది వేచిచూడాల్సి ఉంది. మెట్రోరైలు రెండో దశ రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు, బీహెచ్‌ఈఎల్‌ నుంచి మెహిదీపట్నం వరకు విస్తరిస్తామని టీఆర్‌ఎస్‌ పేర్కొంది. ఎయిర్‌పోర్టు వరకు నాన్‌స్టాప్‌ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా మరో 90 కిలోమీటర్ల వరకు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. కాంగ్రెస్ కూడా ఇదే రకమైన హామీ ఇచ్చింది. పాతబస్తీ వరకు మెట్రో విస్తరణ, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులకు బస్సులు, మెట్రో రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. అయితే ఇవే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఆరోగ్యం, ట్రాఫిక్, ప్రాపర్టీ ట్యాక్స్ వేవర్ వంటి అనేక హామీలను రాజకీయ పార్టీల మేనిఫెస్టోలలో ఉన్నాయి. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు ఎంత నష్టం వాటిల్లనుందో చూడాల్సివుంది. ప్రజలు కట్టిన టాక్స్ డబ్బులను వృధా చేయకుండా అభివృద్ధికి వినియోగించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Tags :
|
|

Advertisement