Advertisement

  • రాష్ట్రంలో లక్షణాలు లేకుండా కరోనా వచ్చినవారే ఎక్కువ శాతం ఉన్నారు..

రాష్ట్రంలో లక్షణాలు లేకుండా కరోనా వచ్చినవారే ఎక్కువ శాతం ఉన్నారు..

By: Sankar Tue, 01 Sept 2020 09:33 AM

రాష్ట్రంలో లక్షణాలు లేకుండా కరోనా వచ్చినవారే ఎక్కువ శాతం ఉన్నారు..


రాష్ట్రంలో ఎక్కువ మంది లక్షణాలు లేకుండానే కరోనా బారినపడుతున్నారని తేలింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటివరకు వచ్చిన కేసులను విశ్లేషించింది. మొత్తం కేసుల్లో 69 శాతం మంది లక్షణాలు లేకుండానే కరోనా బారినపడ్డారు. ఇక 31 శాతం మందికే కరోనా లక్షణాలు బయటపడ్డాయని తేల్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,24,963 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అందులో 86,225 మందికి లక్షణాల్లేవని తెలిపింది.

ఇక 38,738 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి. లక్షణాలు కనిపించని వారు తమకు తెలియకుండానే ఇతరులకు అంటించే ప్రమాదం ఎక్కువ. ఇటువంటి కేసుల కారణంగానే ఇతరులకు పెద్దసంఖ్యలో వైరస్‌ సోకుతోంది. ఈ కారణంగానే అనేక కుటుంబాల్లో 15 నుంచి 20 మందికి కూడా కరోనా సోకినట్లు అధికారులు చెబుతున్నారు.

లక్షణాల్లేకుండా ఎక్కువ మంది కరోనా బారినపడటం, వారి ద్వారా వైరస్‌ సోకిన ప్రాథమిక, సెకండరీ కాంటాక్టులను పరీక్షల ద్వారా గుర్తించి తక్షణ వైద్యం చేయడం వల్ల చాలామంది కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్నారు. వీరిని ఇళ్లలోనే ఉంచుతూ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,299 యాక్టివ్‌ కేసులుంటే, 24,216 మంది ఇళ్లు లేదా వివిధ సంస్థల ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సగానికిపైగా కరోనా పడకలు ఖాళీగా ఉన్నాయి.

మొదట్లో దాదాపు 70 శాతం పడకలు కరోనా రోగులతో నిండేవి. అప్పట్లో కొంత నిర్లక్ష్యం, అవగాహన లేకపోవడం వల్ల సీరియస్‌ అయ్యాకే బాధితులు వైద్యులను సంప్రదించేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ పరీక్షలు చేస్తుండటంతో కరోనా నిర్ధారణ సులువైంది. అందుబాటులో వ్యాధి నిర్ధారణ కేంద్రాలుండటంతో అనుమానమున్న వారు వెంటనే పరీక్షలు చేయించుకుంటున్నారు.

Tags :
|

Advertisement