Advertisement

  • ఆరోగ్య సేతు యాప్‌పై ప్రశంసలు కురిపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఆరోగ్య సేతు యాప్‌పై ప్రశంసలు కురిపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

By: chandrasekar Tue, 13 Oct 2020 5:37 PM

ఆరోగ్య సేతు యాప్‌పై ప్రశంసలు కురిపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ


ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మహమ్మారితో పోరులో భాగంగా భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆరోగ్య సేతు’ యాప్‌‌పై ప్రశంసలు కురిపించింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఈ యాప్‌ మెరుగ్గా పనిచేస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ ప్రశంసించారు. 15 కోట్ల మంది యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని పేర్కొన్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించడం, పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడానికి ఈ యాప్ దోహదపడిందని ఆయన అన్నారు. తద్వారా విస్తృత కరోనా పరీక్షల నిర్వహణ సులభతరం అవుతోంది. టార్గెటెడ్ ఏరియాల్లోనే టెస్టులు నిర్వహించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడానికి వీలైంది’ అని టెడ్రోస్‌ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై WHO డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ మీడియాతో మాట్లాడారు. కరోనా కేసులను గుర్తించడంలో మొబైల్‌ అప్లికేషన్లు, ఇతర డిజిటల్‌ టెక్నాలజీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా భారత్‌ రూపొందించిన ఆరోగ్య సేతు యాప్‌ గురించి ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా గడిచిన నాలుగు రోజులుగా పలు దేశాల్లో రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని టెడ్రోస్‌ పేర్కొన్నారు. ప్రధానంగా యూరప్‌, అమెరికాలో కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. కరోనా ముప్పుపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు, వైరస్ వ్యాప్తి, స్వీయ నియంత్రణ చర్యలకు సంబంధించి వివరాలు అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను తీసుకొచ్చింది.

కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు సమీపంగా వెళ్లినప్పుడు బ్లూటూత్‌, లొకేషన్ ట్రాకింగ్‌ ఆధారంగా ఈ యాప్‌ మనల్ని అప్రమత్తం చేస్తుంది. ఆయా ప్రాంతాల్లో కేసుల తీవ్రతను తెలుపుతుంది. ఒకవేళ మీరు కరోనా బారినపడితే ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? లాంటి వివరాలు, హెల్ప్‌లైన్ నంబర్లు, రాష్ట్రాలు, నగరాల వారీగా కేసుల వివరాలు తదితరాలన్నీ ఈ యాప్ ద్వారా ఈసీగా తెలుసుకోవచ్చు.

Tags :
|

Advertisement