Advertisement

  • కరోనా వైరస్ అంతమవ్వడానికి రెండేళ్లలోపే పట్టవచ్చన్న WHO

కరోనా వైరస్ అంతమవ్వడానికి రెండేళ్లలోపే పట్టవచ్చన్న WHO

By: chandrasekar Sat, 22 Aug 2020 7:04 PM

కరోనా వైరస్ అంతమవ్వడానికి రెండేళ్లలోపే పట్టవచ్చన్న WHO


ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ రెండేళ్లలో అంతం అవ్వొచ్చని WHO తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి రెండేళ్లలోపే అంతమైపోతుందని ఆశిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రెయేసస్ చెప్పారు. ఆయన శుక్రవారం నాడు జెనీవాలో మాట్లాడుతూ 1918 నాటి స్పానిష్ ఫ్లూను అధిగమించటానికి రెండేళ్ల కాలం పట్టిందని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత అధునాతన శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో కరోనా మహమ్మారిని నిలువరించటానికి ఇంకా తక్కువ సమయం పట్టవచ్చునని పేర్కొన్నారు. ప్రపంచం అనుసంధానం ఇంతకు ముందు కన్నా మరింత ఎక్కువగా ఉన్నందున అది విస్తరించే అవకాశం కూడా మరింత ఎక్కువగా ఉందనేది నిజమే. కానీ అదే సమయంలో దానిని నిలువరించే సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞానం కూడా మనకు ఉన్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు.

కరోనావైరస్ మహమ్మారి ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా 2.27 కోట్ల మందికి సోకగా 8,00,000 మంది ప్రాణాలను హరించింది. మహమ్మారి సమయంలో వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ)ల విషయంలో జరుగుతున్న అవినీతి గురించి అడిగిన ప్రశ్నకు డాక్టర్ టెడ్రోస్ స్పందిస్తూ అది నేరపూరితమని అభివర్ణించారు. ఎటువంటి అవినీతీ ఆమోదనీయం కాదు. అయితే పీపీఈలకు సంబంధించిన అవినీతి నిజానికి హత్య చేయటమే. ఎందుకంటే వైద్య, ఆరోగ్య సిబ్బంది పీపీఈ లేకుండా పనిచేసినట్లయితే వారి ప్రాణాలను పణంగా పెడుతున్నట్లే. వారు సేవ చేస్తున్న వారి ప్రాణాలూ ప్రమాదంలో పడతాయి అని ఆయన పేర్కొన్నారు.

WHO అధిపతి డాక్టర్ టెడ్రోస్‌ను దక్షిణాఫ్రికాలో పీపీఈ కిట్ల అవినీతి గురించి ప్రశ్నించినప్పటికీ అనేక దేశాల్లో ఈ సమస్య ఉంది. మహమ్మారి సమయంలో లంచాలు తింటున్నారన్న ఆరోపణలతో కెన్యా రాజధాని నైరోబీలో శుక్రవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నగరంలోని అనేక ప్రభుత్వ ఆస్పత్రులకు చెందిన డాక్టర్లు తమకు వేతనాలు చెల్లించటం లేదని, పీపీఈ కిట్లు అందుబాటులో లేవని నిరసిస్తూ సమ్మెకు దిగారు. మరోవైపు మెక్సికోలో కరోనావైరస్ వ్యాప్తి తీవ్రతను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య అత్యవసరాల కార్యక్రమ అధిపతి డాక్టర్ మైక్ రేయాన్ హెచ్చరించారు.

ప్రస్తుతం అమెరికాలో సగటున ప్రతి పది లక్షల మందికి సుమారు 150 మందికి కోవిడ్ నిర్ధరణ పరీక్షలు చేస్తుంటే మెక్సికోలో ప్రతి పది లక్షల మందికి కేవలం ముగ్గురికి మాత్రమే కోవిడ్ పరీక్షలు చేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రపంచంలో అత్యథిక కోవిడ్ మరణాల సంఖ్యలో మెక్సికో మూడో స్థానంలో ఉంది. మహమ్మారి మొదలైనప్పటి నుంచీ ఇప్పటివరకూ ఆ దేశంలో దాదాపు 60,000 మంది చనిపోయారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు చెప్తున్నాయి. ఇదిలావుంటే అమెరికాలో కరోనా మహమ్మారిని నియంత్రించే విషయంలో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వైఖరి పట్ల డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ మండిపడ్డారు. మన ప్రస్తుత అధ్యక్షుడు దేశం విషయంలో నిర్వర్తించాల్సిన అత్యంత కనీస విధిలో విఫలమయ్యారు. మనల్ని రక్షించటంలో ఆయన విఫలమయ్యారు. అమెరికాను రక్షించటంలో ఆయన విఫలమయ్యారు అని తప్పుపట్టారు. తాను ఎన్నికల్లో గెలిచినట్లయితే మాస్కులు ధరించటం దేశవ్యాప్తంగా తప్పనిసరి చేస్తానన్నారు.

అమెరికాలో శుక్రవారం నాడు కరోనా కారణంగా 1,000 మందికి పైగా చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 1,73,490కి పెరిగింది. శుక్రవారం నాడు పలు దేశాల్లో అత్యధిక సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలో కొత్తగా 324 కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో మార్చి తర్వాత ఇదే అతి పెద్ద సంఖ్య. గతంలో లాగానే ఈ కొత్త కేసులు కూడా చర్చిలు, మ్యూజియంలు, నైట్ క్లబ్‌లు, కరోకే బార్ల ద్వారా వ్యాపించాయి. దీంతో రాజధాని సియోల్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో వీటిని మరోసారి మూసేశారు. పోలండ్ (903), స్లొవేకియా (123) ల్లో శుక్రవారం కొత్త కేసుల సంఖ్య రికార్డు స్థాయికి పెరిగింది. స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య నాటకీయంగా పెరిగింది. లెబనాన్‌లో అత్యధిక కేసులు నమోదవటంతో రెండు వారాల పాటు పాక్షిక లాక్‌డౌన్ విధించారు. రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయడం ద్వారా కొంతవరకైనా కట్టడి చేయగలమన్నారు.

Tags :
|
|

Advertisement