Advertisement

  • సైబర్‌నేరాలపై ‘సైబ్‌ హర్‌' కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ పోలీస్‌శాఖ

సైబర్‌నేరాలపై ‘సైబ్‌ హర్‌' కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ పోలీస్‌శాఖ

By: chandrasekar Sat, 15 Aug 2020 4:54 PM

సైబర్‌నేరాలపై  ‘సైబ్‌ హర్‌' కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ పోలీస్‌శాఖ


తెలంగాణ పోలీస్‌శాఖ సైబర్‌నేరాలపై చిన్నారులు, మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వహించిన ‘సైబ్‌ హర్‌' అవగాహన కార్యక్రమాన్ని సీఎం కే చంద్ర శేఖర్‌రావు అభినందించారు. సైబర్‌ నేరగాళ్ల బారినపడకుండా ఎలా ఉండాలి, సైబర్‌ నేరాలు ఎలా జరుగుతున్నాయి? అనే అంశాలపై నెలరోజులపాటు అవగాహన చేపట్టిన రాష్ట్ర మహిళా భద్రతా విభాగాన్ని అభినందిస్తూ సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

సైబ్‌ హర్‌ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రశంసించడంపై డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ సందేశాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం వినూత్న కార్యక్రమాన్ని ఎంచుకున్నారంటూ మహిళా భద్రతా విభాగం అధికారులు, సిబ్బందిని డీజీపీ అభినందించారు. అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులు, ప్రేక్షకులకు సైతం డీజీపీ శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉంటేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని ఇందుకు రాష్ట్రమే నిదర్శనమని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు.

సైబ్‌ హర్‌ ముగింపు సందర్భంగా శుక్రవారం జూమ్‌ ఆధారంగా నిర్వహించిన సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ.. టెక్నాలజీ వాడకంతో నిర్వహించిన ఈ సైబ్‌ హర్‌లో నెలరోజుల్లో 15 లక్షల మందికి సైబర్‌ నేరాలపై విలువైన సమాచారాన్ని చేరవేసినట్టు తెలిపారు. డీజీపీ మహేందర్‌రెడ్డి సేఫ్టీ గైడ్‌ టు సైబర్‌ క్రైమ్స్‌ పేరిట సైబ్‌ హర్‌ కార్యక్రమాల సమాహారంగా రూపొందించిన పుస్తకాలను తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ జితేందర్‌, సింబయాసిస్‌ లా స్కూల్‌ హైదరాబాద్‌ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ఖాన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :
|

Advertisement