Advertisement

  • వినాయక చవితి బహిరంగ మండపాలకు అనుమతి ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం

వినాయక చవితి బహిరంగ మండపాలకు అనుమతి ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం

By: chandrasekar Mon, 17 Aug 2020 7:47 PM

వినాయక చవితి బహిరంగ మండపాలకు అనుమతి ఇవ్వని  తెలంగాణ ప్రభుత్వం


తెలంగాణ ప్రభుత్వం బహిరంగ మండపాలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించింది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు దేవదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం తెలిపారు. హైదారబాద్‌లో ఈ ఏడాది వినాయక మండపాలు, సామూహిక నిమజ్జనం ఉండడం లేదు. ''ఇంట్లోనే వినాయకుడిని ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకోవాలి. కరోనా వైరస్ కారణంగా, బయట భారీ వినాయక విగ్రహాల ఏర్పాటు వద్దు. ఎక్కడా వినాయక మండపాలకు అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఊరేగింపులు, లౌడ్ స్పీకర్లు, డీజేలకు అనుమతులు లేవు. ప్రజలు సహకరించాలి'' అని ఆయన చెప్పారు.

హిందువులు వినాయక చవితి ఇళ్లల్లో మట్టి ప్రతిమ పెట్టుకుని, పూలు, పండ్లు, ఆకులు (పత్రి)తో అలంకరించి, పిండి వంటలతో పూజిస్తారు. హైదరాబాద్‌లో 1980లలో ఈ సామూహిక వినాయక మండపాల ఏర్పాటు, నిమజ్జనం ప్రారంభమయ్యాయి. సంఘ్ పరివార్ భావజాలం ఉన్న వ్యక్తులు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అనే సంస్థగా ఏర్పడి ఈ సామూహిక ఉత్సవాలను పలు చోట్ల ప్రారంభించడం, అప్పటికే ఉన్న చోట్ల ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడిగా చేసిన జి.రాఘవరెడ్డి, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి గత పోటీ చేసిన డా. భగవంతరావులు ఈ కార్యక్రమ నిర్వహణలో కీలకంగా ఉంటారు. ప్రతి ఏటా ఉత్తర భారతం నుంచి స్వామీజీలను పిలిపించి వారి చేత ప్రసంగాలు ఇప్పిస్తారు.

ఈ సంస్థ ప్రత్యక్ష ప్రమేయం లేకుండా, కాలనీ వాసులు, వీధుల్లో, అపార్టుమెంటుల్లో, ఆఫీసుల్లో వేలాది వినాయక మండపాలు హైదరాబాద్ లో వెలుస్తుంటాయి. వారి వారి సంప్రదాయల ప్రకారం పూజలు చేస్తారు. రకరకాల రూపాల్లో వినాయకులను ప్రతిష్టిస్తారు. నిమజ్జనం ఊరేగింపు భారీగా చేస్తారు. వినాయక విగ్రహాలతో పాటూ, హోరెత్తించే పాటలు, డీజేలూ, రకరకాల అలంకరణలతో హైదరాబాద్ నిండిపోతుంది. దాదాపు 24 గంటల పైగా ఈ కార్యక్రమం సాగుతుంది. వేలాది విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారు. కానీ ఈ సామూహిక ఉత్సవాలు ప్రారంభమైన నాలుగు దశాబ్దాల్లో మొదటిసారి కరోనా కారణంతో బహిరంగ ఉత్సవాలను నిషేధించారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు నగరంలో మండపాలకు అనుమతులు ఇవ్వబోమని హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటించారు.

మరోవైపు హైదరాబాద్ వినాయక ఉత్సవాల్లో అత్యంత పేరున్న బాలాపూర్ మండపం, ఖైరతాబాద్ మండపాలు విగ్రహాల ఎత్తు తగ్గించాయి. బాలాపూర్ గ్రామంలో ఈసారి కేవలం ఆరు అడుగుల విగ్రహమే పెట్టాలనీ, వేలం నిర్వహించకూడదనీ నిర్ణయం తీసుకున్నారు. ఖైరతాబాద్ లో ఉత్సవాలకు ఇది 66వ ఏడాది. ఎప్పుడూ 60 అడుగుల ఎత్తుండే విగ్రహం ఈసారి 9 అడుగుల ఎత్తు మేరకే ఏర్పాటు చేయాలని ఖైరతాబాద్ ఉత్సవ సమితి నిర్ణయించింది. ఈసారి విగ్రహాన్ని కూడా మట్టితో తయారు చేసి శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతిగా పేరు పెట్టనున్నారు. ధన్వంతరి వైద్యానికి దేవుడని హిందువుల నమ్మకం. కరోనా నేపథ్యంలో వారీ పేరు పెట్టారు. ఈ ఏడాది దర్శనానికి భక్తులు మండపం దగ్గరకు రావద్దనీ, ఆన్ లైన్ లో దర్శన ఏర్పాటు చేస్తామనీ సమితి ప్రకటించింది. గతంలో 2009లో వైయస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ గల్లంతయినప్పుడు హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం ఊరేగింపులను స్వచ్ఛందంగా రద్దు చేసుకున్నారు. అప్పుడు వైయస్ ఛాపర్ ప్రమాదంతో, మెల్లిగా ఆటపాటలతో వినాయకులను ఊరేగించే బదులు, ఆ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని, విగ్రహాలను తెచ్చి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసి వెళ్లిపోయారు. ఆవేళ కొన్ని గంటల్లోనే ఈ నిమజ్జనం ముగిసిపోయింది. మళ్లీ ఇప్పుడు అసలు నిమజ్జనం ఊరేగింపు లేకుండా హైదరాబాద్ లో వినాయక చవితి ఇంటికే పరిమితం కానుంది.

Tags :

Advertisement