Advertisement

  • మారటోరియం కేసులో కేంద్రం తీరును ఆక్షేపించిన సుప్రీం కోర్టు

మారటోరియం కేసులో కేంద్రం తీరును ఆక్షేపించిన సుప్రీం కోర్టు

By: chandrasekar Thu, 27 Aug 2020 10:05 AM

మారటోరియం కేసులో కేంద్రం తీరును ఆక్షేపించిన సుప్రీం కోర్టు


బుధవారం మారటోరియంలో ఈఎంఐలపై వడ్డీ వసూలు కేసును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అత్యున్నత న్యాయస్థానం విచారించింది. మారటోరియం కేసులో కేంద్రం తీరును సుప్రీం కోర్టు ఆక్షేపించింది. విపత్తు నిర్వహణ చట్టం కింద తగినన్ని అధికారాలున్నా ఈ విషయంలో చోద్యం చూస్తున్నదని బుధవారం జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విమర్శించింది. వడ్డీని రద్దు చేస్తారా? చేయరా? అని నిలదీసింది. అయితే ఆర్బీఐతో చర్చిస్తున్నామని వారం రోజుల సమయం కావాలని ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహెతా అన్నారు. దీంతో వారంలోగా చెప్పాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 1కి వాయిదా వేసింది. అలాగే విపత్తు నిర్వహణ చట్టం కింద కేంద్రం పాత్ర ఏమిటీ?, వడ్డీపై వడ్డీ అంశాలపై ఈ వారం రోజుల తర్వాత కోర్టుకు వివరణ ఇవ్వాలని కూడా మెహెతాకు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో అన్ని సమస్యలకు ఒకే పరిష్కారం ఉండదని మెహెతా వాదించారు.

ఈ కేసులో ప్రధానంగా మారటోరియం వ్యవధిలో రుణాలపై వడ్డీ చెల్లింపులు ఉండరాదని, వడ్డీపై వడ్డీని వసూలు చేయరాదన్న అంశాలను సుప్రీం కోర్టు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అన్ని రకాల రుణాలపై 6 నెలల మారటోరియం వెసులుబాటును కల్పించిన సంగతి విదితమే. అయితే ఈ వ్యవధిలో వాయిదా వేసుకున్న ఈఎంఐలపైనా బ్యాంకర్లు వడ్డీ వసూలు చేస్తున్నారని ఆగ్రా వాసి గజేంద్ర శర్మ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. దీన్ని సుప్రీం విచారణకు స్వీకరించగా, సర్కారు నుంచి ఇప్పటిదాకా స్పందనే లేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైంది. రుణాల చెల్లింపులు భారంగా మారాయి’ అని సుప్రీం కేంద్రంపై విరుచుకుపడింది.

నిజానికి మారటోరియంలో ఈఎంఐలపై వడ్డీ వసూలు అంశాన్ని సమీక్షించాలని గతంలోనే కేంద్రానికి, ఆర్బీఐకి సుప్రీం సూచించింది. దీంతో వడ్డీ రద్దు బ్యాంకర్ల ఆర్థిక పరిస్థితిని ప్రమాదంలోకి నెడుతుందని ఆర్బీఐ చెప్పడంతో జూన్‌ 4న ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయాన్ని కోర్టు కోరింది. అయినా ఫలితం కనిపించడం లేదు. అయితే పిటిషనర్‌ తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్. ఈ నెల 31తో మారటోరియం గడువు ముగిసిపోతున్న విషయాన్ని కోర్టుకు గుర్తుచేశారు. పిటిషన్లపై విచారణ ఓ కొలిక్కి వచ్చేదాకా గడువును పొడిగించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, కరోనాతో ఆర్థికంగా చితికిపోయామని, మారటోరియంలో కేవలం రుణాల అసలునే వసూలు చేయాలని, వడ్డీని మొత్తం మాఫీ చేయాలని కేంద్రం, ఆర్బీఐలకు సూచించాలంటూ ఈ పిటిషన్‌లో కోర్టుకు శర్మ విజ్ఞప్తి చేశారు.

Tags :

Advertisement