Advertisement

  • భారత ప్రభుత్వం సంచలన నిర్ణయానికి ముఖ్యంగా ప్రజల్లోని ఆగ్రహమే కారణం

భారత ప్రభుత్వం సంచలన నిర్ణయానికి ముఖ్యంగా ప్రజల్లోని ఆగ్రహమే కారణం

By: chandrasekar Tue, 30 June 2020 5:20 PM

భారత ప్రభుత్వం సంచలన నిర్ణయానికి ముఖ్యంగా ప్రజల్లోని ఆగ్రహమే కారణం


సరిహద్దు వివాదం కారణంగా భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్ సహా చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించింది. తూర్పు లద్ధఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సేనల మధ్య ఘర్షణల తర్వాత దేశంలో ‘బాయ్‌కాట్ చైనా’ నినాదం బలంగా వినిపిస్తోంది. కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత జవాన్ల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న చైనాను ఆర్థికంగా దెబ్బతీయడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలన్న డిమాండ్ దేశ ప్రజల నుంచి బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో 59 చైనా యాప్స్‌ను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

సరిహద్దు ఘర్షణ జరిగిన మరుసటి రోజు నుంచే డ్రాగన్ దేశం పట్ల భారతీయుల్లో ద్వేషం తార స్థాయికి చేరింది. పాపులర్ చైనీస్ యాప్స్ టిక్‌టాక్, హెలో, బిగో లైవ్, లైకీ, పబ్‌జీ యాప్స్ డౌన్‌లోడ్స్ ఇటీవలకాలంలో మునుపెన్నడూలేనంతగా తగ్గడమే దీనికి తార్కాణం. టిక్ టాక్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వారిసంఖ్య ఏప్రిల్‌తో పోలిస్తే మేలో 5 శాతం తగ్గగా, మేతో పోలిస్తే జూన్‌ 22 తేదీ వరకు ఏకంగా 38 శాతం తగ్గింది. మరో పాపులర్ సోషల్ మీడియా యాప్ హెలో డౌన్‌లోడ్స్ మే మాసంలో అంతకు ముందు మాసంతో పోలిస్తే 10 శాతం తగ్గగా, జూన్ 22నాటికి 38 శాతం తగ్గాయి.

దేశంలో దాదాపు 45 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్స్‌ను వినియోగిస్తుండగా కనీసం 30 కోట్ల మంది చైనీస్ యాప్స్‌ను ఏదో ఒకటి ప్రతిరోజూ వినియోగిస్తున్నారు. అంటే మూడులో రెండో వంతు భారత స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు టిక్‌టాక్, హెలో, పబ్‌బీ తదితర చైనీస్ యాప్స్‌లో ఏదో ఒకటి తమ ఫోన్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని వాడుతున్నారు. టిక్ టాక్ యాప్‌ను దేశంలో ఏప్రిల్ మాసంలో 23.5 మిల్లియన్ల సార్లు డౌన్‌లోడ్ చేసుకోగా, మే మాసంలో 22.4 మిల్లియన్ల డౌన్‌లోడ్ అయ్యాయి. జూన్ మాసంలో 22నాటి వరకు కేవలం 13.9 మిల్లియన్స్ డౌన్‌లోడ్స్ మాత్రమే నమోదయ్యాయి. అటు పబ్‌జీని ఏప్రిల్ మాసంలో 9 మిల్లియన్ల సార్లు, మే మాసంలో 12.2 మిల్లియన్ల సార్లు డౌన్‌లోడ్ చేసుకోగా, జూన్ మాసంలో 22 తేదీ వరకు 6.6 మిల్లియన్ల డౌన్‌లోడ్స్ మాత్రమే అయ్యాయి. హెలో యాప్‌ డౌన్‌లోడ్స్ ఏప్రిల్ మాసంలో 16.6 మిల్లియన్లు, మే మాసంలో 14.9 మిల్లియన్లుగా ఉండగా జూన్ 22నాటి వరకు 9.2 మిల్లియన్ల డౌన్‌లోడ్స్ నమోదయ్యాయి. లైకీ యాప్‌ డౌన్‌లోడ్స్ ఏప్రిల్‌లో 6.7 మిల్లియన్లు, మేలో 7 మిల్లియన్లు, జూన్ 22 వరకు 4.3 మిల్లియన్లుగా ఉన్నాయి.

మాములుగా కరోనా వైరస్ విజృంభన మొదలైనప్పటి నుంచే చైనా యాప్స్ డౌన్‌లోడ్స్ తగ్గుతూ రాగా గాల్వన్ లోయ ఘటన తర్వాత భారతీయ సెంటిమెంట్ పతాక స్థాయికి చేరడంతో చైనా యాప్స్ కు భారతీయ సెంటిమెంట్ సెగతగిలింది. ఈ చైనీస్ యాప్స్‌కు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఉంటున్నాయి. సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గితే భారత్‌లో మళ్లీ పుంజుకోగలమని చైనీస్ యాప్స్ సంస్థలు భావించగా ఇప్పుడు భారత ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది.

దేశంలో సెంటిమెంట్‌తో పాటు ఇతర కారణాలతో తమకు దూరమైన కస్టమర్లను మళ్లీ దగ్గరకు చేర్చుకునేందుకు టిక్ టాక్ వంటి చైనీస్ యాప్స్ సంస్థలు సరికొత్త వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కాస్త తగ్గిన వెంటనే భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఇతర భారత సోషల్ మీడియా కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని భావించింది.

Tags :
|

Advertisement