Advertisement

అమాంతంగా పెరిగిన బంగారం ధర

By: chandrasekar Tue, 28 July 2020 5:49 PM

అమాంతంగా పెరిగిన బంగారం ధర


పసిడి ధర రోజు రోజుకీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అంతర్జాతీయంగా రూపాయి తగ్గుతుంటే ఇటు బంగారం మాత్రం పైపైకి ఎగబాకుతోంది. సోమవారం నాటి ఫ్యూచర్‌ ట్రేడింగ్‌లో బంగారం ధర ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరుకుంది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.52,220 చేరింది. అమెరికా-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనంతో మదుపరులు బంగారం వైపు మొగ్గుచూపారు.

మరోవైపు శ్రావణమాసం పెళ్లిళ్లు కూడా తోడయ్యాయి. దీంతో పసిడి ధర అమాంతం ఎగిరి గంతేసింది. బంగారం భారతీయులకు పెట్టుబడి మాత్రమే కాదు ఓ సెంటిమెంట్ కూడా. నగలు కొన్నా, బాండ్ కొన్నా బంగారాన్ని సెంటిమెంట్‌తో భావిస్తుంటారు. అందుకే మార్కెట్‌లో బంగారానికి ఎప్పుడూ డిమాండే. గతంలో బంగారంపై పెట్టుబడి పెట్టినవారికి మాత్రం ఈ ఏడాది లాభాల పంట పండినట్టే.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 1శాతం పెరిగి 1,920 డాలర్లకు చేరడంతో సెప్టెంబరు 2011లో నమోదైన మార్కును దాటేసింది. మరోవైపు దేశీయంగా ఆగస్టు గోల్డ్‌ కాంట్రాక్ట్‌లో 10గ్రాములు రూ. 51,782 పలకగా ఆ తర్వాత రూ.52,220 వద్ద ఆల్‌టైమ్‌ రికార్డుకు చేరుకుంది. ఇక ఇవాళ్టి బులియన్‌ ట్రేడింగ్‌లో రూ.929 పెరిగిన 10 గ్రాముల పసిడి రూ.51,964 వద్ద ముగిసింది. వెండి కిలో రూ.3,722 పెరిగి రూ.64,945కు పలికింది. భవిష్యత్‌లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు అంటున్నాయి. ఇదే విథంగా ధరలు పెరుగుతూపోతే సామాన్యుడికి బంగారం అందని దాక్షగా మిగలనుంది.

Tags :
|
|

Advertisement