Advertisement

ఇ-చలానాతో ఏకమైనా కుటుంబం...

By: chandrasekar Sat, 19 Dec 2020 6:18 PM

ఇ-చలానాతో ఏకమైనా కుటుంబం...


హైదరాబాద్ మదీనగూడకు చెందిన ముల్లపూడి సత్యనారాయణకు ఒక్క కుమారుడు ఉన్నాడు. అతడి పేరు సతీశ్. నగరంలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సతీశ్‌కు పదేళ్ల కిందట ఓ మహిళతో వివాహమైంది. అతడి భార్య కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే. ఈ దంపతులకు ఓ కుమార్తె ఉంది. ప్రస్తుతం ఆ చిన్నారి వయసు ఎనిమిదేళ్లు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నప్పటికీ సతీశ్‌కు వ్యవసాయంపై మక్కువ. దీంతో ఉద్యోగం మానేస్తానని తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ, వాళ్లు అందుకు అంగీకరించలేదు. 2017లో ఓ రోజు సతీశ్ చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. సతీశ్ గురించి ఎక్కడా, ఎలాంటి ఆచూకీ దొరక్కపోవడంతో చివరికి కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ, మూడేళ్లుగా కేసులో ఎలాంటి పురోగతి లేదు. కుటుంబసభ్యుల్లో రోజురోజుకీ నిరాశ పెరిగిపోతుండగా ఇంతలో ఒక రోజు పోలీసులు విధించిన ఇ-చలానా ఒకటి అతడి ఆచూకీపై ఆశలు రేపింది. ఇంట్లో చెప్పకుండా వచ్చిన సతీశ్ జహీరాబాద్ మండలం గోవింద్‌పూర్ శివారులో 10 ఎకరాల పొలం కొనుగోలు చేశాడు. స్థానికంగా ఉంటూ ఆ పొలం సాగు చేస్తున్నాడు. తనకు ఇష్టమైన పనిలో నిమగ్నమైయ్యాడు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. పోలీసులు కఠిన నిబంధనలు విధించారు. సతీశ్ మాస్క్ లేకుండా తిరుగుతున్నదని అతడిపై జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నందుకు మరో చలాన్ విధించారు. ఆ చలానాలతో పాటు బైక్ సహా అతడి ఫోటోలను వెబ్‌సైట్‌లో పెట్టారు. సతీశ్ బంధువు ఒకరు వెబ్‌సైట్‌లో ఒక రోజు ఇ-చలాన్లను పరిశీలిస్తుండగా సతీశ్ బైక్‌పై విధించిన చలానా కనిపించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలో సతీశ్ తన బైక్‌తో పాటు ఉన్న విషయాన్ని గుర్తించిన ఆ వ్యక్తి వెంటనే అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. వెంటనే వెళ్లి అక్కడి పోలీసులను ఆశ్రయించారు. సతీశ్‌ను రహస్యంగా పోలీస్ స్టేషన్‌కు రప్పించారు. అప్పటికే అక్కడ ఉన్న తన తల్లిదండ్రులు, కుమార్తెను చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. ఒక చలానాతో కుటుంబం ఏకమైంది.

Tags :
|
|
|
|

Advertisement