Advertisement

  • చైనా టెండర్ల పై కీలక నిర్ణయం తీసుకొన్న మహారాష్ట్రా ప్రభుత్వం

చైనా టెండర్ల పై కీలక నిర్ణయం తీసుకొన్న మహారాష్ట్రా ప్రభుత్వం

By: chandrasekar Wed, 24 June 2020 6:33 PM

చైనా టెండర్ల పై కీలక నిర్ణయం తీసుకొన్న మహారాష్ట్రా ప్రభుత్వం


భారత్ మరియు చైనా సరిహద్దు వివాదం కారణంగా భారత్‌, చైనా వాణిజ్య సంబంధాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. లడఖ్‌లో ఇటీవల 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకొన్న చైనాపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్రంలో రూ.5,020 కోట్ల పెట్టుబడులతో చైనా కంపెనీలు చేపట్టాల్సిన మూడు ప్రాజెక్టులను నిలిపివేస్తున్నట్టు ఉద్ధవ్‌ థాక్రే సర్కార్‌ ప్రకటించింది. ఈ అవగాహనా ఒప్పందాల (ఎంవోయూల)పై ఈ నెల 15న సంతకాలు జరిగాయి.

గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణకు కొద్దిరోజుల ముందు ‘మాగ్నటిక్‌ మహారాష్ట్ర 2.0’ పేరుతో ఉద్ధవ్‌ థాక్రే సర్కార్‌ నిర్వహించిన ఇన్వెస్టర్ల మీట్‌లో ఈ ఒప్పందాలు ఖరారయ్యాయి. చైనాకు చెందిన గ్రేట్‌ వాల్‌ మోటర్స్‌రూ.3,770 కోట్లతో, పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ రూ.1,000 కోట్లతో, హెంగ్లీ ఇంజినీరింగ్‌ రూ.250 కోట్లతో ఈ ఒప్పందాలను కుదుర్చుకొన్నాయి.

ఇప్పుడు ఈ మూడు ప్రాజెక్టులను నిలిపివేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకొన్నామని మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్‌ దేశాయ్‌ సోమవారం వెల్లడించారు. అయితే ఈ మూడు ఒప్పందాలను రద్దుచేసినట్టు కాదని, ఈ ప్రాజెక్టులపై యథాతథ స్థితి కొనసాగుతుందని అధికారిక ప్రకటనలో వివరించారు. ఈ మూడు ప్రాజెక్టుల భవితవ్యంపై కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్టు ఆయన తెలిపారు.

Tags :

Advertisement