Advertisement

  • రూ.8.29 కోట్లు చెల్లించాలని విశాల్‌ను ఆదేశించిన మద్రాస్ హైకోర్ట్

రూ.8.29 కోట్లు చెల్లించాలని విశాల్‌ను ఆదేశించిన మద్రాస్ హైకోర్ట్

By: chandrasekar Sat, 10 Oct 2020 7:45 PM

రూ.8.29 కోట్లు చెల్లించాలని విశాల్‌ను ఆదేశించిన మద్రాస్ హైకోర్ట్


హీరో విశాలే ‘యాక్షన్’ సినిమా మిగిల్చిన నష్టాలను భరించాలని మద్రాస్ హైకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. చిత్ర నిర్మాతలకు విశాల్ రూ.8.29 కోట్లు చెల్లించాలని హైకోర్టు తీర్పులో స్పష్టం చేసింది.

‘యాక్షన్’ చిత్ర నిర్మాణ సంస్థ ట్రైడెంట్ ఆర్ట్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు ఈ తీర్పును ఇచ్చింది. విశాల్, తమన్నా జంటగా నటించిన ‘యాక్షన్’ సినిమాను నిర్మాతలు తక్కువ బడ్జెట్‌లో నిర్మించాలని భావించారు.

అయితే.. ఈ సినిమా రూ.20 కోట్లకు పైగా వసూలు చేయకపోతే ఆ నష్టాన్ని తాను భరిస్తానని విశాల్ నిర్మాతలకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ముందడుగు వేసిన నిర్మాతలు ఈ సినిమాపై రూ.44 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేక, బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.

‘యాక్షన్’ సినిమా తమిళనాడులో రూ.7.7 కోట్లు, ఏపీ, తెలంగాణ కలిపి రూ.4 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. సినిమా రూ.20 కోట్లు కూడా వసూలు చేయలేకపోవడంతో ముందుగా అనుకున్న ప్రకారం తమ నష్టాలను భరించాలని విశాల్‌ను సంప్రదించారు.

నష్టపరిహారం చెల్లించడంతో పాటు తన తదుపరి చిత్రం ‘చక్ర’ సినిమాను ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్‌లోనే తెరకెక్కిస్తానని నిర్మాతలకు విశాల్ హామీ ఇచ్చాడు. కానీ ‘చక్ర’ సినిమాను తన సొంత బ్యానర్‌లోనే విశాల్ తెరకెక్కించాడని, ఈ సినిమా ఓటీటీ విడుదలపై నిషేధం విధించాలని ట్రైడెంట్ ఆర్ట్స్ హైకోర్టును కోరింది.

అయితే ‘యాక్షన్’ చిత్ర నిర్మాతలకు రూ.8.29 కోట్లు చెల్లించాలని విశాల్‌ను ఆదేశించిన మద్రాస్ హైకోర్ట్, ‘చక్ర’ సినిమా విడుదలకు అనుమతినిచ్చింది. విశాల్ నిర్మిస్తున్న ‘చక్ర’ థ్రిల్లర్ జోనర్ సినిమా. ఈ చిత్రంలో విశాల్‌తో పాటు శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా నటిస్తున్నారు. దీపావళికి ఓటీటీ వేదికగా ‘చక్ర’ విడుదల కానుంది.

Tags :
|
|

Advertisement